మలేషియా పర్యటనకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్న భారతీయులకు ముఖ్యమైన ప్రకటన వెలువడింది.
ఇప్పటివరకు భారతీయ పాస్పోర్ట్ ఉన్నవారికి వీసా లేకుండా 30 రోజుల వరకు మలేషియాలో ఉండేందుకు అనుమతి ఉండేది. ఈ వెసులుబాటు 2026 డిసెంబర్ 31తో ముగియనుంది. ఈ విషయాన్ని మలేషియా ఇమ్మిగ్రేషన్ శాఖ నవంబర్ 17న విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. దీని ప్రకారం, 2027 జనవరి 1 నుంచి మలేషియా వెళ్లే భారతీయులు ప్రయాణానికి ముందే చెల్లుబాటు అయ్యే వీసాను కలిగి ఉండటం తప్పనిసరి.
కొత్త నిబంధన ప్రకారం, మలేషియా వీసా దరఖాస్తులను 2026 డిసెంబర్ 1 నుంచి ఆ దేశ ‘మైవీసా’ (MYVISA) వెబ్సైట్ ద్వారా సమర్పించవచ్చు. ప్రయాణ తేదీకి ముందే దరఖాస్తు చేసుకుని, అవసరమైన అనుమతి పొందడం తప్పనిసరి. అంతేకాకుండా, వీసా దరఖాస్తు రుసుము చెల్లించిన తర్వాత దరఖాస్తు తిరస్కరణకు గురైనా, లేదా ప్రయాణ ప్రణాళిక మారినా ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించబోమని మలేషియా ఇమ్మిగ్రేషన్ శాఖ హెచ్చరించింది. అలాగే, వీసా రహిత ప్రయాణ వెసులుబాటును ఉపయోగించుకుని ఉద్యోగాల కోసం వెళ్లకూడదని భారత రాయబార కార్యాలయం గతంలోనే సూచించింది. పర్యాటకం, బంధువులను కలవడం వంటి ప్రయాణాలకు మాత్రమే ఆ సదుపాయం కల్పించబడింది.
ఇంతేకాకుండా, మలేషియాలో ఉండే కాలమంతటికీ ఆరోగ్య బీమా (మెడికల్ ఇన్సూరెన్స్) తీసుకోవడం మంచిదని ఆ దేశ ఇమ్మిగ్రేషన్ శాఖ సూచించింది. విదేశీ పర్యాటకులు అక్కడ వైద్య చికిత్స పొందితే, ఆ ఖర్చులను వారే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కాబట్టి, 2027 జనవరి నుంచి మలేషియా వెళ్లాలనుకునే భారతీయులు వీసా ప్రక్రియ, దరఖాస్తు రుసుము, ప్రయాణ పత్రాలు, ఆరోగ్య బీమా తదితర అంశాలను ముందే సరిచూసుకోవడం అవసరం. ముఖ్యంగా, వీసా లేకుండానే ప్రయాణించవచ్చని భావించిన వారు ఈ కొత్త మార్పును తప్పనిసరిగా గమనించాలి.

Leave a Reply