టెహ్రాన్: పశ్చిమ ఆసియాలో ప్రశాంతత అనేది మరీ కొద్ది గంటల ముచ్చటగానే మిగిలిపోయింది. అమెరికా-ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కాస్తా.. ఇజ్రాయెల్ చేసిన చిన్న తప్పుతో కుప్పకూలిపోయింది. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మళ్ళీ మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై నీలినీడలు కమ్ముకున్నాయి.
ఒప్పందాన్ని తుంగలో తొక్కిన ఇజ్రాయెల్?
అసలేం జరిగిందంటే.. రెండు వారాల పాటు యుద్ధానికి విరామం ప్రకటించిన కొద్దిసేపటికే ఇజ్రాయెల్ తన బుద్ధిని చాటుకుంది. ఇరాన్ గగనతలంలోకి నిఘా కోసం ‘హెర్మ్స్ 900’ అనే అత్యాధునిక డ్రోన్‌ను పంపింది. దీన్ని గమనించిన ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్, తమ డిఫెన్స్ సిస్టమ్‌తో ఆ డ్రోన్‌ను గాలిలోనే పేల్చివేశాయి. దీన్ని ‘ఒప్పంద ఉల్లంఘన’గా పరిగణించిన ఇరాన్, వెంటనే హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండా చమురు నౌకల ప్రయాణాన్ని నిలిపివేస్తూ “నో ఎంట్రీ” బోర్డు తగిలించింది.
ట్రంప్ హెచ్చరికలు – నాగరికతనే తుడిచేస్తాం!
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో హెచ్చరికలు జారీ చేశారు. హార్ముజ్ జలసంధిని వెంటనే తెరవకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిన ఆయన, “ఇరాన్ గనుక దారి ఇవ్వకపోతే, ఆ దేశ నాగరికతనే భూమ్మీద లేకుండా చేస్తాం” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ పెట్టిన డెడ్‌లైన్ ముగియడానికి కొద్ది నిమిషాల ముందే ఈ ఉద్రిక్తతలు మరింత పెరగడం గమనార్హం.
భారత్ వంటి దేశాలపై ప్రభావం ఎంత?
హార్ముజ్ జలసంధి మూతపడటం అంటే ప్రపంచానికి ఊపిరి ఆగిపోవడమే. ఎందుకంటే:
- చమురు నిలిపివేత: సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ, ఇరాక్ వంటి దేశాల నుంచి భారత్, చైనా వంటి దేశాలకు వచ్చే ముడి చమురు, గ్యాస్ సరఫరా పూర్తిగా నిలిచిపోతుంది.
- ధరల మోత: ఇప్పటికే గ్యాస్ సిలిండర్ల కొరతతో ఇబ్బంది పడుతున్న సామాన్యుడికి, ఈ పరిణామం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు మళ్ళీ భగ్గుమనే ప్రమాదం ఉంది.
పాకిస్థాన్ మధ్యవర్తిత్వం విఫలమేనా?
వాస్తవానికి పాకిస్థాన్ చొరవతో ఇరాన్-అమెరికా మధ్య చర్చలు జరిగి, రెండు వారాల విరామం ప్రకటించారు. దీనివల్ల చమురు సమస్య తీరుతుందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ, ఇజ్రాయెల్ డ్రోన్ ప్రయోగంతో పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది.
ప్రస్తుత పరిస్థితి: “ఇజ్రాయెల్, అమెరికా విమానాలు లేదా డ్రోన్లు మా సరిహద్దుల్లో కనిపిస్తే ఇక ఉపేక్షించేది లేదు.. ఇది కేవలం ఆరంభం మాత్రమే” అని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఐఆర్ఐపి (IRIP) ప్రకటించింది. దీంతో గల్ఫ్ తీరంలో మళ్ళీ యుద్ధ టాంకులు గర్జిస్తాయా? లేక అగ్రరాజ్యాలు వెనక్కి తగ్గుతాయా? అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
