మహారాష్ట్ర: తండ్రిని చంపి కారుణ్య నియామకంతో పోలీస్ అయిన కూతురు; ప్రియుడితో గొడవవల్ల 3 ఏళ్ల తర్వాత వెలుగులోకి వచ్చిన కిరాతకం!

ఒక పోలీస్ అధికారిని తన కూతురే అత్యంత పక్కా పథకం ప్రకారం చంపేసింది. ఇందుకు ఆమె ప్రియుడు (అతను కూడా పోలీసే) సహకరించాడు. నిందితులు స్వయంగా పోలీసులు కావడంతో, ఈ ఘటన మూడేళ్ల పాటు కేవలం ఒక ‘ప్రమాదం’గానే అందరూ నమ్మారు. కానీ, ప్రియుడితో వచ్చిన గొడవ కారణంగా ఈ దారుణం బయటపడింది. ప్రస్తుతం తండ్రిని చంపిన కూతురు, ఆమె ప్రియుడితో సహా నలుగురు జైలులో ఉన్నారు.

అసలేం జరిగింది?: హెడ్ కానిస్టేబుల్ జయంత్ బల్లవార్‌ను ఆయన కూతురు ఆర్య బల్లవార్, తన ప్రియుడు ఆశిష్ షెడ్మాకే సహాయంతో హత్య చేసింది. ఈ ఘటన ఏప్రిల్ 25, 2023న జరిగింది. ఆర్య, ఆశిష్‌ల ప్రేమకు జయంత్ అడ్డు చెప్పడమే కాకుండా, ఆర్యను పలుమార్లు మందలించారు. తమ ప్రేమకు అడ్డుగా ఉన్న తండ్రిని వదిలించుకోవాలని ఈ జంట నిర్ణయించుకుంది.

వీరు చైతన్య గెడామ్ అనే వ్యక్తి ద్వారా ₹5,000 ఇచ్చి విషం సేకరించారు. ఏప్రిల్ 25న ఆర్య తన తండ్రికి ఇచ్చే మిల్క్‌షేక్‌లో విషం కలిపి ఇచ్చింది. అది తాగిన కొద్దిసేపటికే డ్యూటీలో ఉన్న జయంత్ స్పృహ తప్పి పడిపోయారు. ఆసుపత్రికి తరలించే లోపే ఆయన మరణించారు. అప్పట్లో ఆర్య తన నటనతో అందరినీ నమ్మించి, సానుభూతి పొందింది. ఆ తర్వాత తండ్రి చనిపోయిన స్థానంలో కారుణ్య నియామకం కింద పోలీస్ కానిస్టేబుల్‌గా చేరింది.

వెలుగులోకి వచ్చిందిలా: హత్య జరిగిన సమయంలో వీరిద్దరూ పోలీస్ సర్వీసులో లేరు. కానీ 2025లో ఇద్దరూ చంద్రపూర్ పోలీస్ బలగాల్లో చేరి శిక్షణ పూర్తి చేసుకున్నారు. అయితే, గత కొన్ని నెలలుగా ఆర్య, ఆశిష్‌ల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ గొడవలు ముదిరిపోవడంతో, భయపడిన ఆశిష్ స్వయంగా రామ్ నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తండ్రిని చంపిన విషయాన్ని ఒప్పుకున్నాడు. మొదట పోలీసులు దీన్ని నమ్మకపోయినా, పాత పోస్ట్‌మార్టం రిపోర్టులను పరిశీలించగా అది విషప్రయోగమని తేలింది.

ప్రస్తుతం ఆర్య, ఆశిష్, విషం సరఫరా చేసిన చైతన్య మరియు ఒక మైనర్ బాలుడిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.


Posted

in

by

Tags: