రాజస్థాన్ రాష్ట్రం భరత్పూర్ జిల్లా రూప్వాస్ ప్రాంతంలో, ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలతో ఓ యువకుడిని స్థానికులు పట్టుకుని దారుణంగా కొట్టిన ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.
ఆ యువకుడిని తాడుతో కట్టేసి, అతని అరికాళ్లపై కర్రలతో కొడుతూ ప్రజలు తమ కోపాన్ని ప్రదర్శించారు.
దాడికి గురైన యువకుడు కూడా అదే రూప్వాస్ ప్రాంతానికి చెందినవాడని, అతనిపై ఇప్పటికే దొంగతనం, గొడవలు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం వంటి పలు కేసులు, ఆరోపణలు పెండింగ్లో ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఘటన జరిగిన రోజు కూడా అతడు ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించగా, అది గమనించిన స్థానికులు అతడిని తప్పించుకోనివ్వకుండా పట్టుకుని తాడుతో కట్టేశారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, ఆ యువకుడిని ప్రజలు చుట్టుముట్టి పట్టుకోవడం, ఆ సమయంలో ఒక మహిళ అతని నోట్లో బలవంతంగా బురద కుక్కడం స్పష్టంగా రికార్డైంది. అంతేకాకుండా, ఇద్దరు వ్యక్తులు కర్రలతో వచ్చి యువకుడి కాళ్లు పట్టుకుని అతని అరికాళ్లపై దారుణంగా కొట్టడం, గుంపులో ఉన్న ఒకరు అతని కాళ్లను తొక్కి హింసించడం చూసేవారిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఇద్దరు పోలీసులు, అక్కడున్న వారిని విచారించారు. అనంతరం ప్రజల చేతిలో దాడికి గురైన ఆ యువకుడిని రక్షించి పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. ప్రజలు గుమిగూడి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని యువకుడిపై దాడి చేసిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో విడుదలై పెద్ద చర్చకు దారితీసింది.

Leave a Reply