మాజీ ప్రియురాలి పేరుతో టిండర్ ప్రొఫైల్ సృష్టించి, అత్యాచారం చేయమంటూ పురుషులను పిలిచిన వ్యక్తి; 18 మంది నిందితురాలి ఇంటికి..

లండన్: ఆన్‌లైన్ మోసం మరియు నిజ జీవితంలో ఎదురయ్యే ప్రమాదాలకు సంబంధించి ఒళ్లు గగుర్పొడిచే ఒక కేసు విచారణ ముగిసింది. తన మాజీ భాగస్వామిని వేధించడానికి అపరిచితులను ఒక ఆయుధంగా వాడుకున్న వ్యక్తిని కోర్టు దోషిగా నిర్ధారించింది.

చెస్టర్ క్రౌన్ కోర్టులో తొమ్మిది రోజుల పాటు జరిగిన విచారణ తర్వాత, గ్రేటర్ మాంచెస్టర్‌కు చెందిన అసద్ హుస్సేన్ (36) స్టాకింగ్ (వేధింపుల)కు పాల్పడినట్లు తేలింది. ఇతనికి జూన్ నెలలో శిక్ష ఖరారు కానుంది.

నియంత్రణ కోల్పోయిన విడిపోయిన బంధం
కోర్టు విచారణ ప్రకారం, హుస్సేన్ ఏప్రిల్ 2024లో “మిక్ రెన్నీ” అనే మారుపేరుతో సదరు మహిళను సంప్రదించాడు. మొదట్లో సజావుగానే ఉన్న వారి బంధం, తర్వాత అతని ఆధిపత్య ధోరణి మరియు నియంత్రణ పెరగడంతో దెబ్బతింది. ఒకసారి సదరు మహిళ ఇంటికి ఒక పురుష మిత్రుడు వచ్చినప్పుడు, హుస్సేన్ రెండు గంటల పాటు నిరంతరాయంగా డోర్ బెల్ కొడుతూనే ఉన్నాడు. పోలీసులు వచ్చి జోక్యం చేసుకునే వరకు అతను వెనక్కి తగ్గలేదు. తర్వాత ఆమె ఫోన్ తనిఖీ చేసి, ఇతర పురుషుల గురించి నిలదీయడంతో వారి బంధం ముగిసింది. విడిపోయిన తర్వాత కూడా ఆమె స్నేహితులకు, కుమార్తెకు ఫోన్ చేసి ఆమెపై అక్రమ సంబంధం ఆరోపణలు చేస్తూ వేధించాడు.

నకిలీ ప్రొఫైల్ – నిజమైన ప్రమాదం
విడిపోయిన కొన్ని వారాలకే హుస్సేన్ ఆమె పేరుతో ఒక నకిలీ టిండర్ అకౌంట్ సృష్టించాడు. అందులో “రేప్ ఫాంటసీ” (అత్యాచారం పట్ల ఇష్టం) ఉన్నట్లు సందేశాలు పంపాడు. దీంతో ఆ సందేశాలు నిజమని నమ్మిన అపరిచితులు ఆమె ఇంటికి రావడం మొదలుపెట్టారు.

కనీసం 18 మంది పురుషులు ఆమె ఇంటి చిరునామాకు వచ్చారు. ఒకే రోజు రాత్రి నలుగురు వ్యక్తులు ఒకే రకమైన సందేశాలతో అక్కడికి చేరుకున్నారు. ఒక వ్యక్తి ఏకంగా తలుపును బలంగా నెట్టి లోపలికి రావడానికి ప్రయత్నించాడు, ఆ సందేశాల్లో తనను “గట్టిగా నెట్టమని” చెప్పారని అతను పోలీసులకు తెలిపాడు. మరొక సందర్భంలో, ఆ మహిళ బయటకు వెళ్లిన సమయంలో ఒక వ్యక్తి నేరుగా ఇంట్లోకి ప్రవేశించాడు. అప్పుడు ఆమె యుక్తవయసులో ఉన్న కుమార్తె పైన గదిలో ఉంది.

చేశైర్ పోలీస్ అధికారి కీత్ టెర్రిల్ దీనిని “భయంకరమైన దారుణం” అని అభివర్ణించారు.

“మిక్ రెన్నీ” అసలు రూపం బయటపడింది ఇలా..
మొదట్లో “మిక్ రెన్నీ” ఎవరో తెలుసుకోవడం పోలీసులకు కష్టమైంది. కానీ చివరకు అతని వ్యాపారానికి సంబంధించిన కారు నంబర్ ద్వారా హుస్సేన్‌ను గుర్తించారు. అతను తన గుర్తింపును దాచడానికి కారు నంబర్ ప్లేట్ మార్చడం, పలు ఫోన్లను వాడటం వంటివి చేశాడని దర్యాప్తులో తేలింది. ఆ ప్రొఫైల్ యాక్టివ్‌గా ఉన్న ప్రతిసారీ అతను ఆమె ఇంటి సమీపంలో కారులో తిరుగుతున్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు.

హుస్సేన్ తన తప్పును ఏమాత్రం ఒప్పుకోలేదని, అతను అత్యంత మోసకారి అని పోలీసులు తెలిపారు. పోలీసులను తప్పుదోవ పట్టించగలనని అతను నమ్మినట్లు, కానీ ఆ రెండు విషయాల్లోనూ అతను విఫలమయ్యాడని అధికారి టెర్రిల్ పేర్కొన్నారు.


Posted

in

by

Tags: