న్యూఢిల్లీ: పాత ప్రేయసి (ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్) ఫోటోను లైక్ చేసినందుకు ఒక యువకుడిపై అతని ప్రస్తుత గర్ల్‌ఫ్రెండ్ ఘోరమైన ప్రతీకారం తీర్చుకుంది. కోపంతో ఆ యువకుడికి చెందిన ₹4 లక్షల విలువైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను అమ్మేసింది. సోషల్ మీడియా యుగంలో డిజిటల్ అలవాట్లు వ్యక్తిగత బంధాలపై ఎలాంటి తీవ్ర ప్రభావం చూపుతున్నాయో ఈ ఘటన అద్దం పడుతోంది.
ప్రేమ, విరహం, బ్రేకప్ కథలు మానవ సమాజానికి కొత్తేమీ కావు. ఇవి శతాబ్దాలుగా సాగుతున్నవే. కానీ సోషల్ మీడియా యుగంలో ఈ కథల్లోకి సరికొత్త ట్విస్టులు వచ్చాయి. మీ భాగస్వామి మనసులో ఇప్పటికీ పాత ప్రేమికులపై ఏమైనా భావాలు మిగిలి ఉన్నాయా లేదా అని తెలుసుకోవడం నేటి భాగస్వాములకు చాలా సులువైపోయింది.
సోషల్ మీడియా కాలం: ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియాలో దాపరికం లేకుండా అన్నీ బహిర్గతమవుతున్నాయి. పాత ప్రేమికుడు లేదా ప్రేయసి ఏదైనా ఫోటో షేర్ చేసినప్పుడు, మనసు అదుపు చేసుకోలేక పొరపాటున దాన్ని లైక్ చేశారో.. ఇక మీ పని అయిపోయినట్లే! కొన్నిసార్లు ఒక చిన్న ‘లైక్’ కూడా కొంప ముంచి, పెద్ద పెద్ద గొడవలకు కారణమవుతోంది. పాత ప్రేమికుల పోస్టులపై లైక్ బటన్ నొక్కే ముందు వంద సార్లు ఎందుకు ఆలోచించాలో ఈ ఘటనే పెద్ద ఉదాహరణ.
ఒక్క ‘లైక్’ తెచ్చిన ముప్పు: ఈ ఉదంతంలో ఒక యువకుడు తన ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోను లైక్ చేశాడు. అంతే.. అతని జీవితంలో పెద్ద భూకంపమే వచ్చింది. ఈ విషయం అతని ప్రస్తుత గర్ల్‌ఫ్రెండ్‌కు అస్సలు నచ్చలేదు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె.. ప్రియుడికి ప్రాణం కంటే ఎక్కువైన బైక్‌ను అమ్మేసి పగ తీర్చుకుంది. ఆమె అమ్మేసింది కూడా మామూలు బైక్ కాదు.. మార్కెట్లో దాదాపు 4 లక్షల రూపాయల విలువ చేసే రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ 650 (Royal Enfield Continental GT 650) మోడల్ బైక్!
పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేని పరిస్థితి: తన బైక్ కనిపించకుండా పోవడంతో ఆ యువకుడికి మైండ్ బ్లాంక్ అయింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేద్దామని భావిస్తున్న తరుణంలో.. ప్రస్తుత గర్ల్‌ఫ్రెండే స్వయంగా ఆ బైక్‌ను తానే అమ్మేశానని చెప్పి షాక్ ఇచ్చింది. దాంతో సదరు యువకుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురై, ఏం చేయలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. ఎందుకంటే ప్రస్తుత గర్ల్‌ఫ్రెండ్ ఉండగా, పాత ప్రేయసి ఫోటోను లైక్ చేయడం కూడా ఆమె దృష్టిలో ఒక పెద్ద నేరమే కదా! అందుకే ఆ యువకుడు భయంతో నోరు మెదపకుండా గప్‌చుప్‌గా ఉండిపోయాడు.
ఈ వార్త ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారడంతో నెటిజన్లు రకరకాల సలహాలు ఇస్తున్నారు. ఒకవేళ ఎక్స్‌తో ఫ్రెండ్‌షిప్ కొనసాగించాలనుకుంటే.. ఇలా ఓపెన్‌గా లైకులు కొట్టడం మానేయాలని, ఒకవేళ పొరపాటున లైక్ పడినా వెంటనే దాన్ని ‘అన్‌లైక్’ చేయడం ఉత్తమమని కామెంట్లు పెడుతున్నారు.

Leave a Reply