చైనాలోని షాన్సీ ప్రావిన్స్‌లోని తైవాన్ నగరంలో నడుస్తున్న ఒక చిన్న రెస్టారెంట్, మాటలు లేకుండానే మానవత్వాన్ని, ప్రేమను చాటుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రజల మనసులను గెలుచుకుంటోంది.
వినికిడి మరియు మూగ లోపం ఉన్న యిన్ యింగ్, ఆమె భర్త ఫెంగ్ యాబిన్ కలిసి నడుపుతున్న ఈ రెస్టారెంట్‌ను ‘చావోషాన్ డెఫ్ సిస్టర్’ అని పిలుస్తారు.
ఆవిరిలో ఉడికించిన రుచికరమైన రైస్ రోల్స్‌కు పేరుగాంచిన ఈ చోటుకు భోజనం కోసం వచ్చే కస్టమర్లు మాట్లాడాల్సిన అవసరం లేదు. గోడపై అతికించిన చైనీస్ సంజ్ఞా భాష చార్టుల ద్వారా గానీ, మెనూ కార్డులో తమకు నచ్చిన వంటకాన్ని చూపిస్తూ గానీ, లేదంటే చిన్న చిరునవ్వుతో సైగ చేస్తూ గానీ కస్టమర్లు సులభంగా ఆర్డర్ ఇస్తున్నారు.
తమ లోపాలను అడ్డంకిగా భావించకుండా, కస్టమర్లతో సులభంగా అనుసంధానమయ్యే వాతావరణాన్ని ఈ దంపతులు కల్పించిన తీరు ఎందరినో ఆకట్టుకుంటోంది. ఇటీవల ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఈ రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు, తన వద్ద తినడానికి డబ్బులు లేవని సంకోచిస్తూ చెప్పాడు.
క్షణమైనా ఆలోచించని యిన్ యింగ్, ఫెంగ్ యాబిన్ దంపతులు అతనికి కడుపు నిండా ఉచితంగా భోజనం పెట్టడమే కాకుండా, కౌంటర్ నుంచి కొంత చిల్లర డబ్బును కూడా తీసి సాయం చేశారు. ఈ ఆప్యాయతతో మనసు కరిగిపోయిన ఆ ఇన్ఫ్లుయెన్సర్, ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో పాటు ఆ దంపతుల అందమైన చిత్రపటాన్ని గీసి బహుమతిగా ఇచ్చాడు.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ మీడియాలోనూ ప్రచురితమైన ఈ కథనం, సాయం చేయడానికి, ప్రేమను పంచడానికి ఆర్భాటపు మాటలు లేదా పెద్ద సౌకర్యాలు అవసరం లేదని స్పష్టం చేస్తోంది.
కష్టాల్లో ఉన్నవారికి ఏమాత్రం సంకోచించకుండా అండగా నిలుస్తున్న ఈ దంపతుల జీవితం, పనితీరు.. నేటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో కరుణ, సౌభ్రాతృత్వం ఇంకా సజీవంగా ఉన్నాయనడానికి చక్కటి నిదర్శనంగా నిలుస్తోంది.

Leave a Reply