ముంబై: ముంబైలోని దాదర్ రైల్వే స్టేషన్లో ఒక వ్యక్తి మహిళపై రైల్వే పట్టాలపై పడి దారుణంగా దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో బయటపడటంతో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఆ వీడియోలో, లేత రంగు చొక్కా ధరించిన ఒక వ్యక్తి పట్టాలపై పడి ఉన్న మహిళను చేతులతో పదేపదే కొట్టడం, కాళ్లతో తన్నడం మరియు ఈడ్చుకుంటూ వెళ్లడం వంటి కిరాతక చర్యలకు పాల్పడటం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ మహిళ తనను తాను రక్షించుకోవడానికి ఎంతగానో ప్రయత్నించినప్పటికీ, ఆ దుర్మార్గుడు కనికరం లేకుండా దాడిని కొనసాగించాడు. ఈ దారుణ దృశ్యం సోషల్ మీడియాలో నెటిజన్లను కలచివేస్తోంది.
ఈ కిరాతక ఘటన జరుగుతున్న సమయంలో రైల్వే స్టేషన్లో ఉన్న ప్రయాణికులలో చాలామంది ఏమీ తెలియనట్లుగా వేడుక చూశారే తప్ప, ఒక్కరంటే ఒక్కరూ ఆ మహిళను కాపాడటానికి ముందుకు రాకపోవడం దురదృష్టకరం. ఈ వీడియో వైరల్ కావడంతో, ముంబై పోలీసులు తమ అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో స్పందిస్తూ.. ఈ విషయాన్ని గవర్నమెంట్ రైల్వే పోలీస్ (GRP) దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అయితే, ఈ ఘటనపై రైల్వే పోలీసుల నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. దాడి చేసిన వ్యక్తిని గుర్తించారా లేదా అదుపులోకి తీసుకున్నారా అనే వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది.
