ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కౌశాంబి జిల్లా కోక్రాజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై, ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో కాన్పూర్ నుండి ప్రయాగ్‌రాజ్ వైపు 200కు పైగా గొర్రెలను తీసుకువెళ్తున్న లారీ, డ్రైవర్ నియంత్రణ కోల్పోయి బోల్తా పడింది.
ఈ ఘోర ప్రమాదంలో లారీలో ప్రయాణిస్తున్న నలుగురు తీవ్రంగా గాయపడగా, 20కి పైగా గొర్రెలను అక్కడికక్కడే మరణించాయి. ప్రమాద శబ్దం విని స్థానికులు, వాహనదారులు అక్కడికి చేరుకున్నారు. అయితే, ప్రాణాపాయ స్థితిలో ఉన్న నలుగురిని కాపాడటానికి బదులుగా, అక్కడికి వచ్చిన ప్రజలు లారీ నుండి పడిపోయిన గొర్రెలను దొంగిలించుకుని వెళ్ళిపోయారు.
గాయపడిన వారు నొప్పితో విలవిలలాడుతుంటే, అస్సలు పట్టించుకోకుండా గొర్రెలను ఎత్తుకుని వెళ్ళిన ఈ దృశ్యాలు అక్కడి వారి మొబైల్స్‌లో రికార్డై సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. నెటిజన్లు వారి ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “వీరంతా మనుషులేనా?” అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనంతరం సంఘటనా స్థలానికి చేరుకున్న కోక్రాజ్ పోలీసులు, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి, లారీని తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.’
ప్రమాదం జరిగిన చోట మానవత్వం లేకుండా గొర్రెలను దొంగిలించిన వారిని సిసిటివి, వైరల్ వీడియోల ద్వారా గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారి చంద్రభూషణ్ మౌర్య స్పష్టం చేశారు.
