మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా వ్యాపించిన ఒక వింత వదంతులను (ఫేక్ న్యూస్) నమ్మి.. 17 ఏళ్ల బాలుడిని అత్యంత పాశవికంగా హతమార్చిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
రోడ్లపై పెన్నులు, కీ-చైన్లు అమ్ముకుంటూ నిరుపేద కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్న రెహాన్ అనే మైనర్ బాలుడే ఈ ఘాతుకానికి బలయ్యాడు. బీబీఏ (BBA) చదువుతున్న ఒక విద్యార్థి తాను డాక్టర్‌నని నాటకమాడుతూ.. మానవ వృషణాలను (Testicles) విక్రయిస్తే రూ. 1.20 కోట్ల వరకు సంపాదించవచ్చనే తప్పుడు సమాచారాన్ని ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూపిస్తూ తన స్నేహితులను నమ్మించాడు.
రూ. 100 ఆశ చూపి కిరాతక హత్య:
డబ్బుపై పెరిగిన దురాశతో ఆ ముఠా సభ్యులు.. ఆగస్టు 6న రూ. 100 ఇస్తామని ఆశ చూపి రెహాన్ అనే బాలుడిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ కత్తితో పొడిచి అతడిని కిరాతకంగా చంపేశారు.
హత్య అనంతరం మృతదేహం నుంచి అవయవాన్ని వేరుచేసి విక్రయించేందుకు ప్రయత్నించిన సమయంలోనే.. దానికి ఎలాంటి వైద్యపరమైన ఆధారం లేదని, అలాంటి అవయవాలను ఎవరూ కొనుగోలు చేయరని వారికి తెలిసి దిమ్మెతిరిగిపోయింది. కొనేవారెవరూ లేకపోవడంతో, ఆ అవయవాన్ని సమీపంలోని చెరువులో పడేసి ఆ ముఠా అక్కడి నుంచి పారిపోయింది.
ఐదుగురి అరెస్ట్ – విచారణలో నిజాలు:
ఆగస్టు 10న కుళ్ళిపోయిన స్థితిలో లభ్యమైన మృతదేహాన్ని గుర్తించడం పోలీసులకు తొలుత కష్టంగా మారింది. అనంతరం బాలుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
నకిలీ వైద్యుడిగా నాటకమాడిన జోహెబ్ ఖాన్, అమీర్ ఖురేషీ సహా మొత్తం ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో ప్రచారమయ్యే నకిలీ వదంతుల వల్ల ఒక అమాయక పేద బాలుడి ప్రాణం బలికావడం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని, ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది.
