తప్పనిసరి హిజాబ్ నిబంధనలను ఉల్లంఘించి సంగీత కచేరీ నిర్వహించారనే ఆరోపణలపై, ప్రముఖ గాయని పరస్తూ అహ్మదితో పాటు ఆమె సంగీత బృందం, నిర్మాణ బృందానికి చెందిన నలుగురు పురుషులకు ఇరాన్ అధికారులు కొరడా దెబ్బల శిక్షను అమలు చేసినట్లు న్యాయవాదులు తెలిపారు.
29 ఏళ్ల పరస్తూ అహ్మది, 2024 డిసెంబర్లో ప్రత్యక్ష ప్రసారం (లైవ్ స్ట్రీమ్) చేసిన ఒక సంగీత కార్యక్రమంలో చేతులు లేని (స్లీవ్‌లెస్) దుస్తులు ధరించి పాడారని ఆరోపణలు వచ్చాయి.
మహిళలు బహిరంగ ప్రదేశాల్లో పాడటాన్ని, అలాగే హిజాబ్ మరియు సంప్రదాయ దుస్తులు ధరించకుండా ఉండటాన్ని ఇరాన్ చట్టాలు నిషేధిస్తున్న నేపథ్యంలో, కోమ్ నగరంలో పరస్తూ అహ్మది, ముగ్గురు సంగీత కళాకారులు మరియు ఒక నిర్మాతకు తలో 74 కొరడా దెబ్బలు కొట్టారని నిందితుల తరపు న్యాయవాది ఒకరు బీబీసీకి ధృవీకరించారు.
గత జూన్ నెలలో కోమ్ క్రిమినల్ కోర్టు, పరస్తూ అహ్మది సహా మరో ఎనిమిది మందిపై ప్రజా నైతికతకు వ్యతిరేకంగా ప్రవర్తించారని, అశ్లీల కంటెంట్‌ను ప్రచురించారని అభియోగాలు మోపి శిక్ష విధించింది. అయితే, వారు ఈ ఆరోపణలను ఖండిస్తూ వచ్చారు.
74 కొరడా దెబ్బలతో పాటు, రెండేళ్ల పాటు దృశ్య-శ్రవణ (ఆడియో-విజువల్) కార్యకలాపాల్లో పాల్గొనకుండా, దేశం విడిచి వెళ్లకుండా నిషేధం విధించారు. సెప్టెంబర్ చివరలో అప్పీల్ కోర్టు కూడా ఈ శిక్షను సమర్థించడంతో, సోమవారం కోమ్ శిక్షల అమలు కార్యాలయంలో ఈ కొరడా దెబ్బల శిక్షను అమలు చేశారు.
శిక్షను తగ్గించడానికి లేదా వాయిదా వేయడానికి న్యాయవాదులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, కొరడా దెబ్బల శిక్షకు గురైన నలుగురు పురుషులను సోహైల్ ఫకీహ్-నసీరి, అమీన్ తాహెరి, అమీరలీ పిర్నియా, మొహ్సెన్ లష్కరీలుగా గుర్తించారని వెల్లడించారు.
ఈ శిక్షపై ఇరాన్ కళాకారులు, మానవ హక్కుల సంస్థలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ప్రాథమిక హక్కులను, మహిళల స్వేచ్ఛను అణచివేసే చర్యగా మానవ హక్కుల కార్యకర్తలు దీనిని విమర్శించారు.
2022లో మహ్సా అమిని మరణం తర్వాత ప్రారంభమైన హిజాబ్ వ్యతిరేక నిరసనలు, ఈ ఏడాది జనవరిలో ఆర్థిక సంక్షోభంతో చెలరేగిన ఆందోళనలు, ఫిబ్రవరి చివరలో ప్రారంభమైన అమెరికా-ఇజ్రాయెల్ ఘర్షణల తర్వాత ఇరాన్లో అరెస్టులు, మరణశిక్షలు తీవ్రమైన నేపథ్యంలో ఈ ఘటన పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. జనవరి నిరసనల్లో అరెస్టయిన పలువురికి మరణశిక్షలు విధించారని, ఇప్పటికే చాలామందిని ఉరితీశారని మానవ హక్కుల సంస్థలు వెల్లడించాయి.

Leave a Reply