మాలె: మాలదీవులలోని వావు అటోల్ వద్ద కేవ్ డైవింగ్ (Cave Diving) చేస్తూ ఊపిరాడక ఐదుగురు ఇటాలియన్ పౌరులు మరణించారు.
మే 14న జరిగిన ఈ ఘోర ప్రమాదం మాలదీవుల చరిత్రలోనే అత్యంత పెద్ద డైవింగ్ దురంతాలలో ఒకటిగా భావిస్తున్నారు. మరణించిన వారిలో నలుగురు ఇటలీలోని ‘జెనోవా విశ్వవిద్యాలయం’ (University of Genoa) తో సంబంధం ఉన్నవారే.
మృతులలో విశ్వవిద్యాలయ అసోసియేట్ ప్రొఫెసర్, ప్రముఖ మెరైన్ బయోలాజిస్ట్ (సముద్ర జీవశాస్త్రవేత్త) మోనికా మోంటెఫాల్కోన్ (51), ఆమె కుమార్తె, బయోమెడికల్ ఇంజనీరింగ్ విద్యార్థిని జార్జియా సోమకల్ (23), పరిశోధనా సహాయకురాలు మురియల్ ఒడెనినో (31), డైవింగ్ ఇన్‌స్ట్రక్టర్ ఫెడరికో గువాల్టియేరి (31) మరియు ‘డ్యూక్ ఆఫ్ యార్క్’ ఆపరేషన్స్ మేనేజర్ జియాన్‌లూకా బెనెడెట్టి ఉన్నారు. రాజధాని మాలెకు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న అలిమత్తా ద్వీపం సమీపంలోని ‘దేవనా కండు’ ఛానల్‌లో ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదం ఎలా జరిగింది? మోసగించిన వాతావరణం
‘డ్యూక్ ఆఫ్ యార్క్’ అనే నౌకలో (క్రూయిజ్) వచ్చిన ఈ బృందం.. సముద్రపు ఉపరితలానికి దాదాపు 55 మీటర్ల లోతులో ఉన్న అత్యంత ప్రమాదకరమైన గుహల సమూహంలోకి ప్రవేశించినప్పుడు ఈ ప్రమాదం సంభవించింది. ప్రస్తుతం జియాన్‌లూకా బెనెడెట్టి మృతదేహం మాత్రమే ఆక్సిజన్ ట్యాంక్ పూర్తిగా ఖాళీ అయిన స్థితిలో గుహ ముఖద్వారం వద్ద లభ్యమైంది.
సముద్రంలో వీస్తున్న బలమైన గాలులు, ప్రతీకూల వాతావరణం కారణంగా మిగిలిన నలుగురి కోసం జరుగుతున్న గాలింపు చర్యలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ పరిశోధక బృందంలో ఉన్న ఒక విద్యార్థిని చివరి నిమిషంలో డైవింగ్‌కు వెళ్లకూడదని నిర్ణయించుకోవడంతో తృటిలో ప్రాణాలతో బయటపడింది. మాలదీవుల పోలీసులు, కోస్ట్ గార్డ్ (తీర సంరక్షణ దళం) ఈ ప్రమాదంపై సమగ్ర విచారణను ప్రారంభించారు.
