“మా జీతాల్లోంచి కట్ చేస్తున్నారు బాబూ..!” ఏసీ (AC) కోచ్‌లో ప్రయాణిస్తూ కూడా ఇలాగేనా..? రైలులో టవల్స్ దొంగిలిస్తూ పట్టుబడిన ప్రయాణికుడు.. ప్రయాణికుడికి క్లాస్ పీకిన సిబ్బంది.. వైరల్ వీడియో..!!

ఖజురహో – ఉదయ్‌పూర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు ఏసీ (AC) కోచ్‌లో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి, రైల్వేకు చెందిన టవల్స్‌ దొంగిలించి తన బ్యాగ్‌లో దాచుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది.

రైలులోని ఏసీ కోచ్‌లో ప్రయాణికుల కోసం ఉంచిన టవల్స్ (తువ్వాళ్లు) అకస్మాత్తుగా కనిపించకుండా పోవడాన్ని గమనించిన కోచ్ అటెండెంట్ దీపు కుష్వాహా, అనుమానంతో ప్రయాణికులను విచారించి ఒకరి బ్యాగ్‌ను తనిఖీ చేశాడు.

అప్పుడు ఆ ప్రయాణికుడి బ్యాగ్ నుంచి 49, 50, 51, 52 నంబర్లు ఉన్న 4 రైల్వే టవల్స్ దొరికాయి. దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటంతో ఆ ప్రయాణికుడు సిగ్గుతో తలదించుకుని నిలబడ్డాడు.

దీంతో ఆగ్రహానికి గురైన అటెండెంట్.. “ఏసీలో ప్రయాణించగలుగుతున్నారు, కానీ సొంతంగా ఒక టవల్ కొనుక్కోలేరా? మీరు దొంగిలించే ఇలాంటి వస్తువుల డబ్బును మా చిన్న జీతాల్లోంచే కట్ చేస్తారు తెలుసా?” అంటూ చిత్తోర్‌గఢ్ రైల్వే స్టేషన్‌లో అతడికి గట్టిగా క్లాస్ పీకాడు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో.. “రైలులో వస్తువులు పోతే అటెండెంట్ల జీతాలే కోతకు గురవుతాయి” అని, “ఎంత డబ్బున్న వారైనా కొందరికి కనీస ఇంగితజ్ఞానం లేకుండా ఇలా ప్రవర్తించడం సిగ్గుచేటు” అని నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.


Posted

in

by

Tags: