“మా నాన్నను తీసుకెళ్తున్నారు.. మాకు వర్క్ పర్మిట్ ఉంది!”.. ఎయిర్‌పోర్టులో కూతురి ఆర్తనాదాలు.. తండ్రీకూతుళ్లను అదుపులోకి తీసుకున్న అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు!

అమెరికాలోని ఓ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన తండ్రిని అధికారులు బలవంతంగా తీసుకెళ్తుండటంతో ఓ యువతి కన్నీరుమున్నీరుగా విలపించింది. తమ వద్ద చెల్లుబాటయ్యే పని అనుమతి పత్రాలు ఉన్నాయని చెబుతూ, వాటిని చూపించేందుకు ప్రయత్నించినా అధికారులు పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని సియాటిల్‌-టాకోమా అంతర్జాతీయ విమానాశ్రయంలో లాస్‌ఏంజెలెస్ వెళ్లే అలాస్కా ఎయిర్‌లైన్స్ విమానం ఎక్కేందుకు ప్రయాణికులు క్యూలో నిలబడి ఉన్నారు. గత శనివారం ఈ సమయంలో సాధారణ దుస్తులు ధరించి, ముఖాలకు మాస్కులు వేసుకున్న అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఓ తండ్రి, కుమార్తెను చుట్టుముట్టి అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఇరుకైన మార్గంలో జరిగిన ఈ తోపులాటను చూసి అక్కడున్న ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.

“మా నాన్నను తీసుకెళ్తున్నారు.. మా దగ్గర సరైన వర్క్ పర్మిట్ పత్రాలు ఉన్నాయి” అంటూ ఆ యువతి అధికారుల ముందు కన్నీటిపర్యంతమైంది. పత్రాలను చూపించేందుకు ప్రయత్నించినప్పటికీ అధికారులు వారిని అక్కడి నుంచి తీసుకెళ్లినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటన కారణంగా విమానం బయలుదేరడంలో కూడా ఆలస్యం జరిగినట్లు కథనం పేర్కొంది.

అదుపులోకి తీసుకున్న వారిని మెక్సికోకు చెందిన రికార్డో లారోండో మెండోజా, సోఫియా హెర్నాండెజ్ మెజియా అని గుర్తించారు. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అమెరికాలో ఉంటున్నారనే ఆరోపణలపై వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అధికారులపై వేడి కాఫీ పోశారనే ఆరోపణతో ఆ మహిళపై అదనపు కేసు కూడా నమోదు చేసినట్లు కథనం వెల్లడించింది.

అమెరికా చట్టాల ప్రకారం వర్క్ పర్మిట్ అనేది ఉద్యోగం చేసేందుకు మాత్రమే అనుమతిస్తుందని, అది శాశ్వత నివాస హక్కును లేదా అరెస్టు నుంచి మినహాయింపును ఇవ్వదని అధికారులు వివరణ ఇచ్చారు.

అయితే, బహిరంగ ప్రదేశంలో ముఖాలకు మాస్కులు ధరించి అధికారులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. అలాస్కా ఎయిర్‌లైన్స్‌తో పాటు వాషింగ్టన్ గవర్నర్ బాబ్ ఫెర్గూసన్ కూడా ఈ ఘటనపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు కథనం పేర్కొంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *