ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసిలోని ఒక దోశల దుకాణంలో ఇద్దరు యువతులు చొరబడి అక్కడున్న వస్తువులను ధ్వంసం చేసి రభస సృష్టించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వారణాసిలోని భేలుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తులసిపూర్ ప్రాంతంలో బాల్ ముకుంద్ పాండే అనే వ్యక్తి దోశల దుకాణం నడుపుతున్నాడు. గత నవంబర్ 14వ తేదీ రాత్రి సుమారు 8 గంటల సమయంలో, నలుపు రంగు స్కూటీపై వచ్చిన ఇద్దరు యువతులు దుకాణం మరియు దాని పరిసరాలను మొబైల్లో వీడియో తీసుకుంటూ అకస్మాత్తుగా లోపలికి చొరబడ్డారు.
లోపలికి ప్రవేశించిన వెంటనే వారు దోశలు వేసే పొయ్యి, పెనం (తవా) ఎత్తి కిందపడేయడంతో పాటు, అక్కడున్న ఇతర వస్తువులను పగలగొట్టి ధ్వంసం చేశారు. దీంతో దుకాణంలో కూర్చుని భోజనం చేస్తున్న మహిళలు, ఇతర కస్టమర్లు భయంతో కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఒక మహిళతో కూడా ఆ యువతులు తీవ్ర వాగ్వాదానికి దిగారు.
ఈ విధ్వంసాన్ని ప్రశ్నించిన దుకాణం యజమాని, సిబ్బందిని అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా, వస్తువులు విసిరి దాడి చేయడంతో సిబ్బందికి, కొందరు కస్టమర్లకు గాయాలైనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, గల్లా పెట్టెలోని (క్యాష్ బాక్స్) డబ్బును కూడా తీసుకోవడానికి ప్రయత్నించారని, తమను చంపుతామని బెదిరించారని దుకాణ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మరోవైపు, తమ తండ్రిపై దాడి చేసినందుకు న్యాయం అడగడానికే తాము దుకాణానికి వచ్చినట్లు ఆ యువతులు మాట్లాడుతున్న మాటలు సీసీటీవీ ఆడియోలో రికార్డయ్యాయి. ఈ ఘటనపై దుకాణ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు.

Leave a Reply