‘మినీ ఇండియా’పై ఇరాన్ దాడి.. అకస్మాత్తుగా ఎందుకు ఆగ్రహం? ఇజ్రాయెల్ డిమోనా అటాక్ వెనుక అసలు కారణం!

జెరూసలేం: మన దేశానికి, ఇరాన్‌కు మధ్య మంచి స్నేహసంబంధాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇరాన్ అకస్మాత్తుగా ఇజ్రాయెల్‌లోని ‘మినీ ఇండియా’పై భీకర దాడికి పాల్పడింది. ఇజ్రాయెల్‌లోని డిమోనా నగరంలో భారతీయులు పెద్ద సంఖ్యలో నివసిస్తుండగా, ఇరాన్ అక్కడ బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. అసలు ఇరాన్ ఈ నగరాన్ని ఎందుకు లక్ష్యంగా చేసుకుంది? దీని వెనుక ఉన్న దిగ్భ్రాంతికర విషయాలు బయటకు వచ్చాయి.

అమెరికా-ఇజ్రాయెల్ కూటమి ఇరాన్‌పై దాడులు చేస్తుండగా, ఇరాన్ దీటుగా సమాధానం ఇస్తోంది. ఇందులో భాగంగానే నిన్న ‘మినీ ఇండియా’గా పిలవబడే డిమోనా నగరంపై క్షిపణులను ప్రయోగించింది.

డిమోనాకు, భారత్‌కు ఉన్న సంబంధం: డిమోనా నగరాన్ని ‘మినీ ఇండియా’ అని పిలుస్తారు ఎందుకంటే ఇక్కడ భారత సంతతికి చెందిన వారు అధికంగా నివసిస్తారు. ముఖ్యంగా మహారాష్ట్ర నుండి వలస వెళ్లి ఇజ్రాయెల్ పౌరసత్వం పొందిన యూదులు ఇక్కడ సెటిల్ అయ్యారు.

  • ఈ నగర జనాభాలో 30 శాతం మంది భారతీయులే. దాదాపు 7,500 మంది భారతీయ మూలాలున్న వారు ఇక్కడ ఉన్నారు.
  • ఇక్కడ వీధుల్లో తిరుగుతుంటే మరాఠీ భాష సర్వసాధారణంగా వినిపిస్తుంది.
  • ఇక్కడి దుకాణాల్లో సోన్ పాపిడి, గులాబ్ జామ్, పాప్రీ చాట్ వంటి భారతీయ వంటకాలు దొరుకుతాయి. భారత్‌లో లాగే ఇక్కడ క్రికెట్ అంటే అమితమైన క్రేజ్.

దాడి వెనుక అసలు కారణం: భారతీయులు ఎక్కువగా ఉన్నారనే కారణంతో ఇరాన్ ఈ దాడి చేయలేదు. అసలు కారణం వేరే ఉంది. ఈ డిమోనా నగరంలోనే ఇజ్రాయెల్ యొక్క అత్యంత కీలకమైన అణు పరిశోధన కేంద్రం ‘నెగెవ్’ ఉంది. నిన్న ఇజ్రాయెల్ ఇరాన్‌లోని అణు కేంద్రంపై దాడి చేయడంతో, దానికి ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్ అణు కేంద్రం ఉన్న డిమోనాపై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది.

47 మందికి గాయాలు – కొనసాగుతున్న భయం: ఈ దాడిలో అణు కేంద్రానికి ఎటువంటి నష్టం కలగలేదు, రేడియేషన్ ముప్పు కూడా లేదు. అయితే, క్షిపణి శకలాలు పడటం వల్ల కొన్ని ఇళ్లు ధ్వంసమయ్యాయి. మహిళలు, పిల్లలు సహా 47 మంది గాయపడి ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం దాడులు ఆగిపోయినా, ఇరాన్ మళ్ళీ ఈ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకోవచ్చని అక్కడి భారతీయులు భయాందోళన చెందుతున్నారు.


Posted

in

by

Tags: