రాబోయే ఒకటి రెండు రోజుల్లో మీ ఫోన్ అకస్మాత్తుగా గట్టిగా మోగుతూ ఏదైనా సందేశం కనిపిస్తే అస్సలు భయపడకండి. దేశవ్యాప్తంగా ‘సెల్ బ్రాడ్‌కాస్ట్ అలర్ట్ సిస్టమ్’ (Cell Broadcast Alert System)ను పరీక్షించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.
కేంద్ర మంత్రులు అమిత్ షా మరియు జ్యోతిరాదిత్య సింధియా మే 2 (ఈరోజు) న ఈ మొబైల్ ఆధారిత విపత్తు హెచ్చరిక వ్యవస్థను అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? మీకు అలర్ట్ వస్తే ఏం చేయాలి? అనే విషయాలు తెలుసుకుందాం.
ప్రభుత్వం ఏమని విజ్ఞప్తి చేస్తోంది?
ఈ ట్రయల్స్‌లో భాగంగా అన్ని రాష్ట్రాల రాజధానులతో పాటు ఢిల్లీ-NCR పరిధిలోని మొబైల్ వినియోగదారులకు హిందీ, ఇంగ్లీష్ మరియు ప్రాంతీయ భాషల్లో (తెలుగుతో సహా) మెసేజ్ పంపిస్తారు.
- ఇది కేవలం ఒక పరీక్ష (Trial) మాత్రమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.
- మెసేజ్ చూసి ఎవరూ ఆందోళన చెందవద్దని, వినియోగదారులు దీని కోసం ప్రత్యేకంగా ఏమీ చేయనవసరం లేదని కోరింది.
- సిస్టమ్ పనితీరును తనిఖీ చేయడమే ఈ ట్రయల్ ముఖ్య ఉద్దేశ్యం.
ఈ అలర్ట్ వల్ల ఉపయోగాలు ఏంటి?
గతంలో కేవలం SMS ద్వారానే హెచ్చరికలు పంపేవారు. కానీ ఇప్పుడు ఈ కొత్త ‘సెల్ బ్రాడ్‌కాస్ట్’ సాంకేతికతను జోడించారు. దీనివల్ల ప్రయోజనాలు ఇవే:
- ప్రకృతి వైపరీత్యాలు: తుపాన్లు, సునామీలు, భూకంపాలు లేదా భారీ వర్షాల సమయంలో ప్రజలను తక్షణమే అప్రమత్తం చేయవచ్చు.
- నెట్‌వర్క్ సమస్య ఉన్నా: సాధారణ SMS కంటే ఇది భిన్నంగా పనిచేస్తుంది. మొబైల్ నెట్‌వర్క్ బలహీనంగా ఉన్నప్పటికీ ఈ అలర్ట్ మీ ఫోన్‌కు చేరుతుంది.
- ఇప్పటికే ఈ వ్యవస్థ ద్వారా ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల సంఖ్యలో అలర్ట్ మెసేజ్‌లు పంపబడ్డాయి.
ఎవరికి ఈ అలర్ట్ వస్తుంది?
మీ ఫోన్‌లో అలర్ట్ సెట్టింగ్స్ ఆన్ చేసి ఉంటేనే ఈ మెసేజ్ వస్తుంది. కొంతమందికి ఈ మెసేజ్ ఒకటి కంటే ఎక్కువసార్లు వచ్చే అవకాశం ఉంది. మెసేజ్ వచ్చినప్పుడు మీరు కేవలం ‘OK’ బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది.
మీ ఫోన్‌లో ఈ సెట్టింగ్ ఆన్ చేసుకోవడం ఎలా?
అత్యవసర సమయాల్లో ఇటువంటి హెచ్చరికలు పొందడానికి ఈ క్రింది విధంగా చేయండి:
- మీ ఫోన్ Settings లోకి వెళ్లండి.
- Safety and Emergency అనే ఆప్షన్‌పై టాప్ చేయండి.
- అక్కడ Wireless Emergency Alerts అనే ఆప్షన్ కనిపిస్తుంది.
- అందులో Test Alerts లేదా Allow Alerts ను ఆన్ చేసుకోండి.
