మెట్రో నగరాల్లో చాలా మంది అదనపు ఆదాయం కోసం ఫ్లాట్లు కొని అద్దెకు ఇస్తుంటారు. అయితే, ఇలా అద్దెకు ఇచ్చిన యజమాని ‘వినియోగదారుడి’ (Consumer) కిందకు వస్తారా రారా అనే విషయంలో ఉన్న సందిగ్ధతను సుప్రీంకోర్టు తాజా తీర్పుతో తొలగించింది.
ఒక నివాస ఫ్లాట్‌ను కేవలం అద్దెకు ఇచ్చినంత మాత్రాన, ఆ ఫ్లాట్ కొనుగోలుదారుడు వినియోగదారుల రక్షణ చట్టం పరిధి నుండి బయటకు పోరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా మరియు జస్టిస్ ఎన్.వి. అంజారియాలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది.
కోర్టు ఏం చెప్పింది? బిల్డర్ వేసిన వాదనను కొట్టివేస్తూ, ఒక కొనుగోలుదారుడిని ‘వాణిజ్య ప్రయోజనం’ (Commercial Purpose) కింద వినియోగదారుల జాబితా నుండి తొలగించాలంటే.. ఆ ఫ్లాట్ కొనుగోలు వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం కేవలం వ్యాపారమేనని బిల్డర్ నిరూపించాల్సి ఉంటుంది. కేవలం అద్దెకు ఇవ్వడం వాణిజ్య కార్యకలాపం కిందకు రాదని కోర్టు తెలిపింది.
వినియోగదారుల రక్షణ చట్టం సెక్షన్ 2(1)(డి) ప్రకారం.. ఎవరైతే వస్తువును లేదా సేవను డబ్బు చెల్లించి పొందుతారో వారు వినియోగదారులు. కానీ, తిరిగి అమ్మడానికి (Resale) లేదా పూర్తిస్థాయి వ్యాపార లాభాల కోసం కొనేవారు దీని పరిధిలోకి రారు. ఈ కేసులో అప్పీలుదారుడు కేవలం అద్దెకు ఇచ్చినంత మాత్రాన అతన్ని వినియోగదారుడు కాదు అనడం చెల్లదని కోర్టు తేల్చి చెప్పింది.
తీర్పు ప్రభావం: జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (NCDRC) అంతకుముందు బిల్డర్‌కు అనుకూలంగా ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది. దీనివల్ల తమ ఇళ్లను అద్దెకు ఇచ్చి జీవనం సాగించే వేలాది మంది గృహ యజమానులకు పెద్ద ఊరట లభించింది. బిల్డర్ సేవల్లో లోపం ఉంటే, ఫ్లాట్ అద్దెకు ఉన్నా సరే యజమాని వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు చేసి నష్టపరిహారం పొందవచ్చు.
