చాలామంది ఫోన్ ఆన్ అవుతున్నంత వరకు అది బాగానే ఉందని అనుకుంటారు. కానీ సాంకేతికంగా ఫోన్ ఎక్స్పైరీ అనేది కంపెనీ ఇచ్చే ‘సాఫ్ట్వేర్ సపోర్ట్’ పై ఆధారపడి ఉంటుంది.
మొబైల్ ఫోన్ ఎక్స్పైరీ డేట్ అంటే ఏమిటి?
ప్రతి మొబైల్ కంపెనీ తన ఫోన్లకు నిర్ణీత కాలం వరకు ఆపరేటింగ్ సిస్టమ్ (OS) అప్డేట్స్ మరియు సెక్యూరిటీ ప్యాచెస్ (Security Patches) అందిస్తుంది. సాధారణంగా ఇది 2 నుండి 4 ఏళ్ల వరకు ఉంటుంది. కొన్ని ప్రీమియం బ్రాండ్లు అంతకంటే ఎక్కువ కాలం సపోర్ట్ ఇస్తాయి. కంపెనీ ఎప్పుడైతే ఈ అప్డేట్స్ ఇవ్వడం ఆపేస్తుందో, అప్పటి నుండి ఆ ఫోన్ సాంకేతికంగా ‘ఎక్స్పైర్’ అయినట్లు లెక్క.
ఎక్స్పైర్ అయిన ఫోన్ వాడటం వల్ల కలిగే నష్టాలు:
- హ్యాకింగ్ ముప్పు: సెక్యూరిటీ అప్డేట్స్ లేని ఫోన్లు హ్యాకర్ల బారిన పడే అవకాశం ఎక్కువ. మీ వ్యక్తిగత సమాచారం మరియు డేటా దొంగిలించబడవచ్చు.
- పనితీరు తగ్గడం: అప్డేట్స్ లేకపోవడం వల్ల ఫోన్ స్లో అవుతుంది, యాప్స్ తరచూ క్రాష్ అవుతుంటాయి.
- బ్యాంకింగ్ సమస్యలు: సాఫ్ట్వేర్ పాతది అయిపోతే.. సెక్యూరిటీ కారణాల దృష్ట్యా కొన్ని బ్యాంకింగ్ మరియు పేమెంట్ యాప్స్ ఆ ఫోన్లో పనిచేయడం ఆపేస్తాయి.
మీ ఫోన్ ఎక్స్పైరీని ఎలా చెక్ చేయాలి?
- సెట్టింగ్స్ చూడండి: మీ ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘Software Update’ సెక్షన్ చూడండి. గత ఆరు నెలలు లేదా ఏడాది కాలంగా ఎటువంటి అప్డేట్ రాకపోతే, మీ ఫోన్ సపోర్ట్ ముగిసిందని అర్థం.
- కంపెనీ వెబ్సైట్: మీ మొబైల్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి, మీ మోడల్‌కు ఎన్ని ఏళ్ల వరకు అప్డేట్స్ ఇస్తారో చెక్ చేసుకోవచ్చు.
- తయారీ తేదీ: ఫోన్ బాక్స్‌పై ఉండే ‘Manufacturing Date’ నుండి కంపెనీ ప్రకటించిన సపోర్ట్ పీరియడ్‌ని లెక్కించుకోవాలి.
