‘మీ అమ్మకు ఒంట్లో బాగోలేకపోతే షెల్టర్ హోమ్‌లో వదిలేసి ఆఫీసుకి రా’.. సెలవు అడిగినందుకు మేనేజర్ కర్కశ సమాధానం

అనారోగ్యంతో ఉన్న తన తల్లిని చూసుకోవడానికి సెలవు కావాలని అడిగిన ఒక మహిళా ఉద్యోగిని పట్ల ఆమె మేనేజర్ ఎంత క్రూరంగా ప్రవర్తించాడో వివరిస్తూ ‘రెడిట్’ (Reddit) లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ విషయాన్ని ఆమె సహోద్యోగి సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఆ పోస్ట్ ప్రకారం.. “ఒక పెద్ద ప్రైవేట్ బ్యాంకులో పని చేసే నా సహోద్యోగిని కొన్ని రోజులు సెలవు కావాలని అడిగింది. తప్పుడు మందులు వాడటం వల్ల ఆమె తల్లి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. ఆమెకు కావలసింది కేవలం తన తల్లి పక్కన ఉండి చూసుకోవడానికి కొంచెం సమయం మాత్రమే.”

కానీ దానికి ఆ మేనేజర్ ఇచ్చిన సమాధానం విని అందరూ షాక్‌కు గురవుతున్నారు. “మీ అమ్మ ఆరోగ్యం కుదుటపడకపోతే, ఆమెను ఏదైనా మెడికల్ సెంటర్ లేదా షెల్టర్ హోమ్‌లో వదిలేసి ఆఫీసుకి రా” అని మేనేజర్ సమాధానం ఇచ్చాడు. ఆ ఉద్యోగిని ముందు అప్పుడు రెండు మార్గాలే ఉన్నాయి – ఒకటి ఆఫీసుకి రావడం, రెండు తల్లిని చూసుకోవడం. ఆమె తన తల్లి వద్దే ఉండాలని నిర్ణయించుకుని, వెంటనే తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఆమె ఆ బ్యాంకులో చాలా ఏళ్లుగా పని చేస్తోంది.

ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు మేనేజర్ వైఖరిపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది పని ప్రదేశంలో జరిగే వేధింపులేనని (Workplace Harassment), సదరు మేనేజర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


Posted

in

by

Tags: