సైబర్ మోసాలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిమ్ కార్డ్ నిబంధనలలో భారీ మార్పులు చేస్తోంది. కొత్త ‘సిమ్ బైండింగ్’ (SIM Binding) నిబంధన ప్రకారం, వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్‌లను ఉపయోగించాలంటే ఫోన్‌లో ఆ నంబర్‌కు సంబంధించిన ఫిజికల్ సిమ్ కార్డ్ (Physical SIM) ఉండటం తప్పనిసరి కానుంది.
మోసాలకు చెక్ పెట్టడమే లక్ష్యం: ప్రస్తుతం దాదాపు అందరూ మొబైల్ ఫోన్లను వాడుతున్నారు. అయితే మీ పేరు మీద ఒకటి కంటే ఎక్కువ సిమ్ కార్డ్‌లు ఉంటే, కొత్త ఏడాది నుండి మీరు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. భారతదేశంలో ప్రతి ఏటా సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్నాయి. దీనివల్ల సామాన్యులు కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. ఈ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది.
సిమ్ బైండింగ్ అంటే ఏమిటి? సాధారణంగా మోసగాళ్లు వాట్సాప్ వంటి యాప్‌లలో భారతీయ నంబర్లను ఉపయోగిస్తారు. తాము దొరికిపోకుండా ఉండేందుకు, ఒకసారి యాప్‌ను యాక్టివేట్ చేశాక ఆ సిమ్ కార్డును పారేస్తుంటారు. అయితే కొత్త నిబంధన అమల్లోకి వస్తే, ఏ మెసేజింగ్ యాప్ వాడాలన్నా ఆ నంబర్ సిమ్ కార్డ్ కచ్చితంగా ఫోన్‌లోనే ఉండాలి. సిమ్ తీసేస్తే యాప్ పనిచేయదు.
అమలు ఎప్పటి నుండి? టెలికమ్యూనికేషన్ శాఖ (DoT) ఈ నిబంధనను అమలు చేయడానికి టెలికాం కంపెనీలకు 2025 నవంబర్‌లో 90 రోజుల సమయం ఇచ్చింది. ఇది 2026 ప్రారంభం నాటికి పూర్తిగా అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
ట్రాయ్ (TRAI) మరియు ఆర్బీఐ (RBI) చర్యలు: సైబర్ నేరాలను అరికట్టడానికి ఆర్బీఐ, ఎన్‌పీసీఐ (NPCI), ట్రాయ్ నిరంతరం కొత్త సాంకేతిక మార్పులు చేస్తున్నాయి.
ఎన్‌పీసీఐ: మోసగాళ్లు డబ్బు కోసం పంపే యూపీఐ రిక్వెస్ట్ ఫీచర్‌ను ఇటీవల నిలిపివేసింది.
ట్రాయ్: సిమ్ కార్డ్ కేవైసీ (KYC) నిబంధనలను కఠినతరం చేసింది. అలాగే ప్రచార కాల్స్ (Promotional Calls) కోసం ప్రత్యేక నంబర్ సిరీస్‌ను తప్పనిసరి చేసింది.
ఇకపై 2026 నుండి ఫోన్‌లో ఫిజికల్ సిమ్ కార్డ్ ఉంటేనే వాట్సాప్ వంటి యాప్‌లను వినియోగించుకునే వీలుంటుంది.
