ఒక సైనికుడు కాశ్మీర్‌లోని మారుమూల సరిహద్దు ప్రాంతంలో దేశాన్ని రక్షిస్తున్నాడు. ఒకరోజు అకస్మాత్తుగా అతని మొబైల్లో ‘సిగ్నల్’ పోయింది. “కొండ ప్రాంతం కదా, సిగ్నల్ సమస్య అనుకుంటా” అని అతను సరిపెట్టుకున్నాడు. కానీ సరిగ్గా అదే సమయంలో, ఎక్కడో ఉన్న ఒక కేటుగాళ్ల ముఠా ఆ సైనికుడి పేరుతో ‘డూప్లికేట్’ సిమ్ కార్డును పొంది, అతని బ్యాంక్ ఖాతాలోకి చొరబడి డబ్బునంతా ఊడ్చేసింది. దీనినే ‘సిమ్ స్వాప్’ (SIM Swap) మోసం అంటారు.
ఈ మోసం ఎలా జరుగుతుంది? మీ సిమ్ కార్డు కేవలం ఫోన్ మాట్లాడటానికే కాదు; అది మీ బ్యాంక్ ఖాతాకు తాళం చెవి లాంటిది. ఫిషింగ్ (Phishing) లేదా సోషల్ మీడియా ద్వారా మీ వ్యక్తిగత వివరాలను (పేరు, పుట్టిన తేదీ, ఆధార్ వివరాలు) దొంగిలించే ముఠా.. మీ మొబైల్ నెట్వర్క్ సంస్థను (Airtel, Jio వంటివి) సంప్రదిస్తారు. “నా సిమ్ కార్డు పోయింది, అదే నంబర్‌తో కొత్త సిమ్ ఇవ్వండి” అని నకిలీ గుర్తింపు కార్డులు చూపించి కొత్త సిమ్ తీసుకుంటారు. ఒకే నంబర్‌పై రెండు సిమ్‌లు పనిచేయవు కాబట్టి, మీ దగ్గర ఉన్న సిమ్ పనిచేయడం ఆగిపోతుంది (Deactivate అవుతుంది). ఇప్పుడు మీ బ్యాంక్ ఓటీపీలన్నీ (OTP) దొంగ దగ్గర ఉన్న కొత్త సిమ్ కార్డుకు వెళ్తాయి.
తప్పించుకోవడం ఎలా?
- సిగ్నల్ పోతే జాగ్రత్త: కారణం లేకుండా మీ ఫోన్లో సిగ్నల్ కట్ అయితే, వెంటనే కస్టమర్ కేర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయండి. మీ సిమ్‌ను బ్లాక్ చేయించి, మీ నంబర్‌ను తిరిగి పొందండి.
- సిమ్ కార్డుకు ‘పిన్’ (PIN) సెట్ చేయండి: మీ ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి సిమ్ కార్డ్ లాక్ సెట్ చేయండి. దీనివల్ల మీ ఫోన్ పోయినా ఇతరులు ఆ సిమ్‌ను వాడలేరు.
- పాస్వర్డ్లు మార్చండి: వెంటనే మీ ఈమెయిల్, బ్యాంక్, సోషల్ మీడియా పాస్‌వర్డ్‌లను మార్చండి.
- యాప్ ఆధారిత భద్రత: కేవలం ఓటీపీల మీదనే ఆధారపడకుండా, ‘Google Authenticator’ వంటి భద్రతా పద్ధతులను వాడండి.
