ఆధునిక సాంకేతికత విస్తరిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మానవాళికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తున్నప్పటికీ.. అదే సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ సాగుతున్న ‘ఏఐ వాయిస్ స్కామ్’ (AI Voice Scam) మోసాలు ప్రజల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి.
ప్రజల సన్నిహిత బంధువులు లేదా స్నేహితుల గొంతును అచ్చుగుద్దినట్లుగా అనుకరిస్తూ (Voice Cloning), వారు ఏదో తీవ్ర ఆపదలో చిక్కుకున్నట్లు నమ్మించి క్షణాల్లో డబ్బులు కాజేసే ఈ అత్యాధునిక సైబర్ నేరాలపై భారత కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ (DoT) తాజాగా అత్యవసర హెచ్చరికలు, మార్గదర్శకాలను జారీ చేసింది.
సోషల్ మీడియాలో లభించే ఒక వ్యక్తి స్వల్ప ఆడియో రికార్డింగ్‌ను ఆసరాగా చేసుకుని సైతం, వారి అసలు గొంతును నూటికి నూరు శాతం రీక్రియేట్ చేసే సామర్థ్యాన్ని ఈ సరికొత్త ఏఐ టూల్స్ కలిగి ఉన్నాయి.
అకస్మాత్తుగా మీ మొబైల్‌కు వచ్చే గుర్తుతెలియని కాల్‌లో.. మీ పిల్లలో లేదా కుటుంబసభ్యులో వణికిపోతూ “నేను ప్రమాదంలో చిక్కుకున్నాను, వెంటనే అర్జెంట్‌గా డబ్బులు పంపించండి” అని మాట్లాడితే ఎవరైనా తీవ్ర ఆందోళనకు గురికావడం సహజం.
ప్రజల ఈ భావోద్వేగాలను, కంగారును ప్రధాన ఆయుధంగా చేసుకుని కేటుగాళ్లు క్షణాల వ్యవధిలో లక్షలాది రూపాయలను కొల్లగొడుతూ సరికొత్త హైటెక్ దోపిడీలకు తెరతీస్తున్నారు. ఇలాంటి నకిలీ ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు ప్రజలు ఏమాత్రం భయాందోళనలకు గురికాకుండా సంయమనంతో, అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.
కాల్ రాగానే ఆదరాబాదరాగా డబ్బులు బదిలీ చేయకుండా, సంబంధిత వ్యక్తిని వేరే నంబర్ ద్వారా లేదా ఇతర మార్గాల్లో నేరుగా సంప్రదించి వాస్తవాలను నిర్ధారించుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే అపరిచిత నంబర్ల నుంచి వచ్చే అనుమానాస్పద కాల్స్ పట్ల జాగ్రత్త వహించాలని కోరింది. సైబర్ ప్రపంచంలో రోజురోజుకూ పెరిగిపోతున్న ఇలాంటి సరికొత్త మోసాల బారిన పడకుండా ఉండాలంటే ప్రజల్లో సాంకేతిక అవగాహన ఎంతో అవసరం.

Leave a Reply