ముంబై నుండి వారణాసి వచ్చిన అంకిత సాహసం.. పోలీసుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టి, దొంగల అడ్డాను కనిపెట్టిన టెక్కీ!

వారణాసి: ఆధ్యాత్మిక నగరి కాశీలో పర్యాటకుల భద్రత గురించి అధికారులు ఎన్ని గొప్పలు చెప్పుకున్నా, వాస్తవ పరిస్థితి ఎలా ఉందో ముంబైకి చెందిన అంకిత అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నిరూపించింది. అస్సీ ఘాట్ వద్ద మొబైల్ దొంగల ముఠాను పట్టుకోవడంలో పోలీసులు ఆసక్తి చూపించకపోవడంతో, అంకిత స్వయంగా రంగంలోకి దిగి ఎవరూ ఊహించని పని చేసి చూపించింది.

తన సాంకేతిక నైపుణ్యంతో దొంగల అడ్డా వరకు వెళ్ళిన అంకిత, పోలీసుల బాధ్యతారాహిత్యాన్ని బయటపెట్టడమే కాకుండా సోషల్ మీడియాలో హీరోగా నిలిచింది.

అసలేం జరిగిందంటే..
ముంబైలోని ఘాట్కోపర్ నివాసి ఉమేష్ గుప్తా కుమార్తె అంకిత గుప్తా వారణాసి సందర్శనకు వచ్చింది. సోమవారం సాయంత్రం అస్సీ ఘాట్ అందాలను తిలకిస్తుండగా, వేల మంది జనం మధ్యలో ఒక దొంగ ఆమె చేతిలోని సుమారు 2 లక్షల రూపాయల విలువైన ఐఫోన్‌ను (iPhone) లాక్కొని పారిపోయాడు. అంకిత వెంటనే భేలుపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు కేవలం ఫోన్ పోయిందని ఒక చిన్న రిపోర్ట్ రాసుకుని చేతులు దులుపుకున్నారు.

పోలీసుల సుస్తి.. అంకిత కమాండ్!
పోలీసుల నిర్లక్ష్యాన్ని చూసి అశ్చర్యపోయిన అంకిత, లొకేషన్ ట్రేస్ చేయడం తమ వల్ల కాదని వారు చెప్పడంతో తానే స్వయంగా వెతకడం ప్రారంభించింది. తన సాఫ్ట్‌వేర్ నైపుణ్యాన్ని ఉపయోగించి, ఒక ప్రత్యేక యాప్ ద్వారా ఫోన్ ఐఎంఈఐ (IMEI) నంబర్‌ను ట్రాక్ చేయడం మొదలుపెట్టింది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో, ఫోన్ లొకేషన్ అస్సీ ఘాట్ నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న చాంద్‌పూర్ ప్రాంతంలో స్థిరంగా ఉన్నట్లు గుర్తించింది.

అర్ధరాత్రి దొంగల అడ్డా వద్దకు ఒంటరిగా..
అంకిత ఒంటరిగానే ఆ ప్రాంతానికి చేరుకుంది. అక్కడ ఒక ఇంట్లో మొబైల్ లొకేషన్ చూపిస్తోంది. అంకిత పట్టుబట్టడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నప్పటికీ, గదిని సోదా చేసే సాహసం చేయకుండా, “చూద్దాంలే” అని చెప్పి వెళ్ళిపోయారు. కానీ అంకిత వెనక్కి తగ్గలేదు. తెల్లవారుజామున 5 గంటలకు మళ్ళీ అదే ఇంటి వద్దకు వెళ్లి స్థానికుల సహాయం కోరింది. ఆ గది రాజేంద్ర పటేల్ అనే వ్యక్తికి చెందినదని, దానిని ఎవరో అద్దెకు తీసుకున్నారని తెలిసింది. ఆ గదికి బయట నుండి తాళం వేసి ఉంది.

తాళం తీస్తే అందరూ షాక్!
స్థానికుల సమక్షంలో ఆ గది తాళం తీయగా లోపల దృశ్యం చూసి అందరూ నివ్వెరపోయారు. అక్కడ అంకిత ఐఫోన్‌తో పాటు 15 నుండి 20 వరకు ఖరీదైన మొబైల్ ఫోన్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ విషయం తెలియగానే పోలీసులు పరుగులు తీస్తూ వచ్చి ఫోన్లన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు.

ఇప్పుడు భేలుపూర్ పోలీసులు తాము సర్వైలెన్స్ ద్వారానే లొకేషన్ కనిపెట్టి ఫోన్లను రికవరీ చేశామని చెప్పుకుంటుండటం గమనార్హం. ప్రస్తుతం పోలీసులు ఆ గదిలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.


Posted

in

by

Tags: