ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతాప్‌గఢ్‌లో చిన్న స్థాయి బ్యాంకింగ్ సేవా కేంద్రాన్ని (మిని బ్యాంక్/కస్టమర్ సర్వీస్ పాయింట్) నిర్వహిస్తున్న 40 ఏళ్ల మంజు యాదవ్, తన ఇంటి పడకగదిలోనే రక్తపు మడుగులో శవమై తేలిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
ఈ హత్య కేసులో ఆమె భర్త అజయ్ కుమార్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫతన్‌పూర్ మార్కెట్ ప్రాంతంలో నివసించే మంజు యాదవ్ అక్కడ చిన్న బ్యాంకింగ్ కేంద్రాన్ని నడుపుతుండగా, ఆమె భర్త అజయ్ కుమార్ మెడికల్ షాపు నడుపుతున్నట్లు తెలిసింది. ఇంట్లోకి చొరబడిన దొంగలే మంజును చంపేశారని మొదట సమాచారం వచ్చినప్పటికీ, పోలీసుల లోతైన విచారణలో ఈ కేసు ఊహించని మలుపు తిరిగింది.
నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు ముఖానికి ముసుగులు ధరించి ఇంట్లోకి చొరబడి దోపిడీకి పాల్పడి, మంజును హత్య చేశారని భర్త మొదట పోలీసులకు తెలిపాడు. సమాచారం అందుకున్న వెంటనే అదనపు ఎస్పీ అలోక్ కుమార్ సహా పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించింది. మంజు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. అయితే ఘటనకు సంబంధించి భర్త చెప్పిన విషయాలపై పోలీసులకు తీవ్ర అనుమానం వచ్చింది. ఇంటి సమీపంలోని బావి వద్ద లభించిన కొన్ని కీలక ఆధారాలు ఈ విచారణలో ప్రధాన మలుపుగా మారాయి.
దీంతో మంజు భర్త అజయ్ కుమార్ యాదవ్‌ను పోలీసులు తమదైన శైలిలో విచారించారు. నిందితుడి మద్యపానం అలవాటుపై అంతకుముందు రోజు సాయంత్రం భార్యాభర్తల మధ్య తీవ్ర గొడవ జరిగినట్లు విచారణలో తేలిందని అదనపు ఎస్పీ వెల్లడించారు. ఆ ఘర్షణలో విచక్షణ కోల్పోయిన భర్తే ఆమెపై దాడి చేసి ప్రాణాలు తీశాడని పోలీసులు స్పష్టం చేశారు. ఆ తర్వాత ఇంట్లోకి దొంగలు వచ్చి హత్య చేశారంటూ నాటకమాడి, పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించినట్లు వెల్లడైంది. దీంతో అజయ్ కుమార్ యాదవ్‌ను అరెస్ట్ చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.
ఈ కేసులో హత్య జరిగిన పరిస్థితులు, ఘటనా స్థలంలో లభించిన క్లూస్, ఇతర ఆధారాల ఆధారంగా పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన మంజు యాదవ్ స్థానిక ప్రజలకు నగదు డిపాజిట్, విత్‌డ్రా వంటి ప్రాథమిక బ్యాంకింగ్ సేవలను అందిస్తూ ఉండేవారు. కుటుంబ కలహాలు, మద్యం వ్యసనం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్న ఈ దుర్ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు చట్టపరమైన తదుపరి చర్యలు చేపడుతున్నారు.

Leave a Reply