తెలంగాణలోని కామారెడ్డిలో ముగ్గురు ఆడపిల్లలను తండ్రే చెరువులోకి నెట్టి హత్య చేసిన ఘటన ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తోంది. పేదరికం వేధించడం, మూడు పూటలా అన్నం కూడా పెట్టలేని నిస్సహాయత ముగ్గురు చిన్నారుల ప్రాణాలను బలితీసుకుంది.
అసలేం జరిగింది? కామారెడ్డి పట్టణానికి చెందిన ఇస్మాయిల్ ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. అతని భార్య సబీనా. వారికి షీబాత్ (8), ఆయత్ (7), మరియం (5) అనే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఆటోపై వచ్చే ఆదాయం కుటుంబ అవసరాలకు సరిపోకపోవడంతో సబీనా ఇళ్లలో పనికి వెళ్లేది. కుటుంబం గడవడం కోసం ఇస్మాయిల్ సుమారు 5 లక్షల రూపాయల వరకు అప్పు చేశాడు. అప్పు తీర్చలేక, వడ్డీలు కట్టలేక తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు.
దోశ ఇప్పిస్తానని నమ్మించి.. పిల్లలకు కడుపు నిండా అన్నం కూడా పెట్టలేని స్థితిలో ఉన్న ఇస్మాయిల్, ఒక దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. హోటల్‌కు వెళ్లి దోశ ఇప్పిస్తానని పిల్లలను నమ్మించి తన ఆటోలో ఎక్కించుకున్నాడు. పిల్లలు ఉత్సాహంగా ఆటో ఎక్కారు. కానీ, హోటల్‌కు వెళ్లే దారిలో కాకుండా పట్టణ శివార్లలోని ఒక చెరువు దగ్గరకు ఆటోను తీసుకెళ్లాడు.
అక్కడ ఆటో ఆపి, ఏమాత్రం కనికరం లేకుండా ఒక్కొక్కరినీ చెరువులోకి నెట్టేశాడు. ఆ పిల్లలకు ఈత రాకపోవడంతో ప్రాణాల కోసం కొట్టుకుంటుంటే, కన్నతండ్రి అర గంట సేపు అక్కడే నిలబడి వారు చనిపోయేవరకు చూశాడు. ముగ్గురూ ఊపిరి వదిలారని నిర్ధారించుకున్నాక ఏమీ తెలియనట్లు ఇంటికి తిరిగి వచ్చాడు.
నిజం బయటపడిందిలా.. ఇంటికి వచ్చిన ఇస్మాయిల్‌ను పిల్లల గురించి భార్య అడగగా, అతను సరైన సమాధానం చెప్పలేదు. దీంతో అనుమానం వచ్చిన సబీనా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇస్మాయిల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చెరువులో గాలించి ఇద్దరు అమ్మాయిల మృతదేహాలను వెలికితీశారు. పెద్దమ్మాయి మృతదేహం కోసం గాలింపు కొనసాగుతోంది. నిందితుడు ఇస్మాయిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
