మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలో, భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త.. ఆమె గాఢ నిద్రలో ఉన్న సమయంలోనే గొడ్డలితో దాడి చేసి దారుణంగా హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
ఈ దారుణ ఘటనలో 35 ఏళ్ల శారద జోంధలే ప్రాణాలు కోల్పోయారు. భార్యను హత్య చేసిన అనంతరం భర్త పరారు కావడంతో, ముగ్గురు పిల్లలు తల్లిని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
39 ఏళ్ల దినేష్ జోంధలేకు మద్యం సేవించే అలవాటు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే, భార్య ప్రవర్తనపై అనుమానంతో తరచూ ఆమెతో గొడవ పడేవాడని సమాచారం. ఈ క్రమంలో, ఘటన జరిగిన రోజు తెల్లవారుజామున 4 నుంచి 5 గంటల మధ్య శారద ఇంట్లో గాఢ నిద్రలో ఉన్నారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన దినేష్, గొడ్డలితో భార్య మెడపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన శారద అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
భార్యను హత్య చేసిన తర్వాత దినేష్ ఇంటి నుంచి పారిపోయాడు. ఉదయం ఎంతసేపటికీ తల్లిదండ్రులు నిద్రలేవకపోవడంతో, వారి కుమార్తె వెళ్లి చూసింది. ఎన్నిసార్లు పిలిచినా పలకకపోవడంతో లోపలికి వెళ్లి చూడగా, తల్లి రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండటం చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. అదే సమయంలో తండ్రి ఇంట్లో లేడనే విషయం కూడా తెలిసింది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, 15 ఏళ్ల కుమారుడు సహా ముగ్గురు పిల్లలు ఉన్నారు.
సమాచారం అందుకున్న జవుల్కా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, పరారీలో ఉన్న దినేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం మాలెగావ్ నగరంలో తలదాచుకున్న అతడిని పట్టుకుని అరెస్టు చేశారు. భార్య హత్యకు గురైన ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తల్లిని కోల్పోయి ముగ్గురు పిల్లలు అనాథలు కాగా, ఈ హత్యకు సంబంధించి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave a Reply