భారతదేశంలో నివసిస్తున్న కేసేనియా షకిర్జియానోవా (Kseniia Shakirzianova) అనే రష్యన్ మహిళ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేసిన ఒక సాధారణ వీడియో వేలాది మంది దృష్టిని ఆకర్షించింది. కారులో కూర్చుని శాండ్విచ్ తింటూ, భారతదేశం గురించి విదేశాల్లో ఉన్న 6 ప్రధాన అపోహలను (Myths) ఆమె తన అనుభవంతో వివరించారు.
అపోహ 1: భారత ఎండలు చర్మాన్ని కాల్చేస్తాయి భారత్ వెళ్తే అక్కడి ఎండలకు చర్మం కమిలిపోయి, నల్లగా (ట్యాన్) అయిపోతుందని కేసేనియాను ఆమె స్నేహితులు భయపెట్టారట. కానీ మూడేళ్లుగా ఇక్కడే ఉంటున్న ఆమె.. తన చర్మం రంగు ఏమాత్రం మారలేదని, ఇది కేవలం అతిగా చేసి చెప్పే భయం మాత్రమేనని నవ్వుతూ కొట్టిపారేశారు.
అపోహ 2: భారతీయ ఆహారం వల్ల బరువు పెరుగుతారు భారతీయ వంటకాలు చాలా నూనెతో ఉంటాయని, అవి తింటే బరువు పెరగడం ఖాయమని విదేశాల్లో అనుకుంటారు. కానీ కేసేనియా అనుభవం మాత్రం వేరు. భారత్‌లో ఉంటున్నా తన బరువు పెరగలేదని, భారతీయ ఆహారం అంటే కేవలం మసాలాలు, నూనె మాత్రమే కాదని ఆమె స్పష్టం చేశారు.
అపోహ 3: భారత్‌లో బైక్ నడపడం తప్పనిసరి భారతదేశంలో అందరూ బైక్‌ల మీదనే తిరుగుతారని విదేశీయులు అనుకుంటారు. కానీ కేసేనియా తాను ఇప్పటివరకు ఇక్కడ బైక్ నడపలేదని, కనీసం బైక్ వెనుక కూడా కూర్చోలేదని చెబుతూ ఆ అపోహను పోగొట్టారు.
అపోహ 4: భారతీయ మహిళలు రోజూ చీరలే కడతారు భారతదేశంలో ప్రతి మహిళా ప్రతిరోజూ చీర కట్టుకుని ఉంటుందని విదేశీయుల ఆలోచన. కానీ తాను గానీ, ఇక్కడి మహిళలు గానీ రోజూ చీరలు కట్టమని, భారత్ ఆధునికత మరియు సంప్రదాయాల కలయిక అని, ప్రజలు తమకు నచ్చిన దుస్తులు ధరిస్తారని ఆమె వివరించారు.
అపోహ 5: భారత్ రాగానే ఆధ్యాత్మికంగా మారిపోతారు భారత్ రాగానే ప్రతి విదేశీయుడు యోగా చేస్తూ, సాధువులా మారిపోతారని ఒక నమ్మకం ఉంది. కానీ తాను భారత్ వచ్చినంత మాత్రాన అకస్మాత్తుగా ఆధ్యాత్మికంగా మారిపోలేదని, అందరూ యోగా రిట్రీట్లలోనే గడపరని ఆమె స్పష్టం చేశారు.
అపోహ 6: రోజంతా మసాలా టీ తాగడం మసాలా టీ భారత్‌కు గుర్తింపు కావచ్చు, కానీ అందరూ రోజూ ఐదు సార్లు టీ తాగరని ఆమె చెప్పారు. ఇవి చిన్న విషయాలే అయినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా భారత్ పట్ల ఉన్న మూస ధోరణిని (Stereotypes) ఇవి ప్రతిబింబిస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు.
