కోల్కతాలోని ‘బ్లూ లైన్’ మార్గంలో ఉన్న నేతాజీ భవన్ మెట్రో రైల్వే స్టేషన్లో రాత్రి 10 గంటల సమయంలో తీవ్ర కలకలం రేపిన ఘటన చోటుచేసుకుంది.
మద్యం మత్తులో ఉన్నట్లు భావిస్తున్న ఇద్దరు మహిళా ప్రయాణికులు, మెట్రో స్టేషన్ సిబ్బంది మరియు ఆర్పీఎఫ్ (RPF) భద్రతా సిబ్బందితో తీవ్ర వాగ్వాదానికి దిగి, ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు.
వారు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటూ, జుట్లు పట్టుకుని లాగి కిందపడేసి కొట్టుకోవడమే కాకుండా, చివరకు అడ్డుకోబోయిన స్టేషన్ మాస్టర్పై కూడా దాడి చేశారు. ఈ దృశ్యాలను అక్కడే ఉన్న తోటి ప్రయాణికులు తమ సెల్ఫోన్లలో రికార్డ్ చేయడంతో, ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.
అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. విధుల్లో ఉన్న అధికారులపై దాడికి దిగిన ఆ ఇద్దరికీ ఒక్కొక్కరికి ₹1,000 చొప్పున జరిమానా విధించి, క్షమాపణ పత్రం రాయించుకుని విడిచిపెట్టారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులపై భౌతిక దాడికి దిగిన వ్యక్తులకు కేవలం ₹1,000 జరిమానా విధించి వదిలేయడం సరికాదని, వారిపై కఠినమైన చర్యలు తీసుకుని జైలుకు పంపాలని నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
