మనం ఇల్లు కట్టుకునేటప్పుడు ఎంతో ఇష్టపడి లక్షల రూపాయలు ఖర్చు చేసి మరీ ఖరీదైన టైల్స్ వేయిస్తుంటాం. కానీ, వాటిని శుభ్రం చేసేటప్పుడు తరచూ కొన్ని తప్పులు చేస్తుంటాం. టైల్స్‌పై టీ, కాఫీ, గ్రీజు లేదా తుప్పు (రస్ట్) వంటి మొండి మరకలు పడినప్పుడు.. వాటిని వదిలించడానికి ఏది పడితే అది వాడేస్తుంటాం.
రోజువారీ క్లీనింగ్‌లో కూడా మనం ఇలాంటి తప్పులే చేస్తుంటాం. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో కనిపించే ‘క్విక్ హ్యాక్స్’ (చిట్కాలు) చూసి, వాటిని నిజమని నమ్మి ఆలోచించకుండా కెమికల్స్ వాడేస్తుంటాం. వీటివల్ల టైల్స్ పై ఉండే మెరిసే పొర (ప్రొటెక్టివ్ లేయర్) మెల్లమెల్లగా దెబ్బతిని, లక్షల రూపాయల విలువైన టైల్స్ పాడైపోతాయి. ఒకవేళ మీరు కూడా మీ ఇంటి టైల్స్‌ను గట్టిగా రుద్ది క్లీన్ చేయాలని అనుకుంటుంటే.. కాస్త ఆగండి! మీ ఇంటి ఫ్లోరింగ్ అందాన్ని జీవితకాలం పాటు దెబ్బతీసే ఆ తప్పుల గురించిన పూర్తి వివరాలు ఈ నివేదికలో తెలుసుకోండి.
పొరపాటున కూడా ఈ 4 పనులు చేయకండి!
- హార్డ్ యాసిడ్స్ వాడటం: టైల్స్‌ను శుభ్రం చేయడానికి టాయిలెట్ క్లీనర్లు లేదా ఘాటైన యాసిడ్లను ఎప్పుడూ వాడకండి. పొరపాటున కూడా వాటిని టైల్స్‌పై ఒక్క చుక్క కూడా పడనీయవద్దు. ఇవి మరకలను తొలగిస్తాయి కానీ, టైల్స్ మధ్య ఉండే ‘గ్రావుట్’ (జాయింట్లు/సిమెంట్ లైన్లు) ను లోపలికల్లా తినివేసి, టైల్స్ రంగును మార్చేస్తాయి.
- ఇనుప పీచు (మెటల్ స్క్రబ్బర్): టైల్స్ క్లీన్ చేయడానికి ఇనుప పీచు లేదా స్టీల్ స్క్రబ్బర్లను అస్సలు ఉపయోగించవద్దు. వీటితో గట్టిగా రుద్దడం వల్ల టైల్స్‌పై కంటికి కనిపించని సన్నటి గీతలు (స్క్రాచెస్) పడతాయి. ఇవి మొదట్లో కనిపించకపోయినా, రానురాను ఆ గీతల్లో దుమ్ము, మురికి చేరి టైల్స్ చాలా అసహ్యంగా తయారవుతాయి.
- బ్లీచ్, అమ్మోనియా మిశ్రమం: రెండు వేర్వేరు క్లీనింగ్ లిక్విడ్లను కలిపి ఎప్పుడూ వాడకండి. ఉదాహరణకు బ్లీచ్ మరియు అమ్మోనియా కలిపితే.. వాటి నుండి అత్యంత విషపూరితమైన వాయువులు విడుదలవుతాయి. ఇవి టైల్స్కే కాకుండా మీ ఆరోగ్యానికి కూడా చాలా ప్రమాదకరం.
- తడిగా వదిలేయడం: ఫ్లోర్ క్లీన్ చేసిన తర్వాత గదిని అలానే తడిగా వదిలేయడం మనం చేసే పెద్ద తప్పు. నీళ్లు ఆరిపోయిన తర్వాత ఆ నీటి మరకలు టైల్స్‌పై తెల్లగా పేరుకుపోయి మరింత మురికిగా కనిపిస్తాయి. అందుకే టైల్స్ తుడిచిన వెంటనే పొడి బట్టతో క్లీన్ చేయాలి.
మరి టైల్స్ క్లీన్ చేయడానికి సరైన పద్ధతి ఏంటి?
ఇంటి టైల్స్‌ను సురక్షితంగా క్లీన్ చేయడానికి కొన్ని సులభమైన చిట్కాలు ఇక్కడ ఉన్నాయి:
- రోజువారీ క్లీనింగ్: ప్రతిరోజూ బకెట్ క్లీన్ వాటర్ లో కొద్దిగా బేకింగ్ సోడా (వంటసోడా) కలిపి ఇల్లు తుడవాలి. వారానికి ఒకసారి నీటిలో మైల్డ్ షాంపూ కలిపి, మెత్తటి క్లాత్‌తో తుడిస్తే టైల్స్ మెరుస్తాయి. ఆ తర్వాత కేవలం మంచి నీటితో మరోసారి తుడిచి, వెంటనే పొడి గుడ్డతో క్లీన్ చేయాలి.
- సాధారణ మరకలకు: టైల్స్‌పై మరకలు ఉంటే నీటిలో నిమ్మరసం కలిపి తుడవాలి. లేదా వైట్ వెనిగర్ (తెల్లటి సిరకా), నీళ్ల మిశ్రమాన్ని వాడవచ్చు. ఇది సహజసిద్ధమైనది కాబట్టి టైల్స్‌కు ఎలాంటి హాని చేయదు. క్లీనింగ్ కోసం ఎప్పుడూ మైక్రోఫైబర్ మాప్ లేదా మెత్తటి కాటన్ బట్టలను మాత్రమే వాడాలి.
- జిడ్డు మరకలకు: ఒకవేళ నూనె లేదా గ్రీజు మరకలు పడితే.. గోరువెచ్చని నీటిలో కొద్దిగా డిష్ వాష్ లిక్విడ్ (గిన్నెలు కడిగే జెల్) కలిపి శుభ్రం చేయాలి.
- టైల్స్ జారకుండా ఉండాలంటే: ఫ్లోరింగ్ జిడ్డుగా మారి జారుతున్నట్లు అనిపిస్తే.. నీటిలో కొద్దిగా ఉప్పు, బేకింగ్ సోడా కలిపి క్లీన్ చేయండి.
- ఫర్నిచర్ గీతలు పడకుండా: ఇంట్లో ఉండే బరువైన సోఫాలు, అల్మారాల వల్ల టైల్స్ లేదా మార్బుల్స్‌పై గీతలు పడకుండా ఉండటానికి వాటి కాళ్ల కింద రబ్బర్ షీట్లు లేదా ప్రొటెక్టివ్ ప్యాడ్స్ ఉంచండి.
ముఖ్య గమనిక: మార్కెట్లో దొరికే ఎలాంటి కొత్త క్లీనర్నైనా నేరుగా ఫ్లోర్ మధ్యలో వాడకుండా.. మొదట టైల్స్ ఉన్న ఏదైనా ఒక మూలన (కనిపించని చోట) కొద్దిగా వాడి టెస్ట్ (ప్యాచ్ టెస్ట్) చేసుకోండి. ఆ తర్వాతే పూర్తి ఫ్లోరింగ్‌కు ఉపయోగించండి.
