“మేకప్ వేసుకోమన్న తల్లిదండ్రులు.. ‘100’కు డయల్ చేసిన పెళ్లికూతురు..!” అర్ధరాత్రి రిసెప్షన్, తెల్లవారుజామున పోలీస్ ఎంట్రీ.. కల్యాణ మండపంలో హైడ్రామా..!!

తిరువళ్లూరు జిల్లా పరిసర ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల యువతికి, ఓ యువకుడికి వివాహం జరిపించాలని ఇరు కుటుంబాల తల్లిదండ్రులు నిర్ణయించారు.

దీంతో మీంజూరులోని ఓ వివాహ మండపంలో పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి, ఆదివారం ఉదయం ముహూర్తాన్ని నిర్ణయించారు.

పెళ్లికి ముందు రోజు రాత్రి బంధువులు, స్నేహితుల సమక్షంలో రిసెప్షన్ వేడుకను ఘనంగా నిర్వహించారు. నూతన వధూవరులను బంధువులు, స్నేహితులు ఆశీర్వదించి వెళ్లిపోయారు. అనంతరం మరుసటి రోజు తెల్లవారుజామున పెళ్లి కార్యక్రమాల కోసం మండపంలో హడావుడి ప్రారంభమైంది.

ముహూర్త సమయం దగ్గరపడుతుండటంతో వధువును నిద్రలేపిన తల్లిదండ్రులు, వెంటనే మేకప్ వేసుకుని పెళ్లి వేదిక వద్దకు రావాలని కోరారు. అయితే, ఆ యువతి మేకప్ వేసుకోవడానికి నిరాకరించడమే కాకుండా, తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, తాళి కట్టించుకోనని ఒక్కసారిగా తేల్చి చెప్పింది.

తల్లిదండ్రులు, బంధువులు ఎంతగా నచ్చజెప్పి, బతిమిలాడినా ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. దీంతో తెల్లవారుజామున సుమారు 5:30 గంటల సమయంలో ఆ యువతి తన సెల్‌ఫోన్‌ నుంచి 100 నంబర్‌కు ఫోన్ చేసి, తనకు బలవంతంగా పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే వివాహ మండపానికి చేరుకుని విచారణ చేపట్టి, పెళ్లిని నిలిపివేశారు.

కూతురు తీసుకున్న నిర్ణయంతో షాక్‌కు గురైన తల్లిదండ్రులు, అవమానంగా భావించి ఆమెను మండపంలోనే వదిలి వెళ్లిపోయినట్లు సమాచారం. దీంతో పోలీసులు ఆ యువతిని అలమాదిలోని మహిళా సంరక్షణ కేంద్రానికి తరలించి, అక్కడ సురక్షితంగా అప్పగించారు.


Posted

in

by

Tags: