ఈరోజు ఆదివారం.. చాలా ఇళ్లలో మాంసాహారం సిద్ధమవుతోంది. ముఖ్యంగా చాలామంది ఇళ్లలో ‘మటన్’ కర్రీ ఘుమఘుమలాడుతుంటుంది.
ఎంతో మందికి ఇష్టమైన ఈ మాంసానికి ‘మటన్’ అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు చూద్దాం.
పూర్వ కాలంలో పండుగలు, విశేష దినాల్లో మాత్రమే ఇంట్లో మటన్, చికెన్ వంటివి వండుకునేవారు. కానీ, ఇప్పుడు గ్రామ స్థాయి నుండి నగరాల వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మాంసాహారం కొని తినడం సర్వసాధారణమైపోయింది. ముఖ్యంగా ఆదివారం వచ్చిందంటే మటన్, చికెన్ లేదా చేపల కూర ఉండాల్సిందే అనే పరిస్థితి చాలా ఇళ్లలో ఉంది.
అయితే, మనం ఎంతో రుచిగా తినే ఈ ఆట మాంసాన్ని ‘మటన్’ అని ఎందుకు అంటారో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ పేరు వెనుక ఉన్న చరిత్ర ఏమిటి? దీని గురించి చాలామందికి తెలియదు. ఆ ఆసక్తికరమైన సమాచారం ఇక్కడ ఉంది.
‘మటన్’ (Mutton) అనే పదం పాత ఫ్రెంచ్ పదం ‘మౌటన్’ (Mouton) నుండి వచ్చింది. దీనికి అసలు అర్థం ‘గొర్రె’ (Sheep). ఆ తర్వాతే ఈ పదం ఇంగ్లాండ్‌లోకి ప్రవేశించింది. క్రీ.శ. 1066లో నార్మన్లు ఇంగ్లాండ్‌ను జయించిన తర్వాత, ఫ్రెంచ్ భాష ఆంగ్లంలో బాగా కలిసిపోయింది. దీనివల్ల ‘మటన్’ అనే పదం ఇంగ్లాండ్‌లో వాడుకలోకి రావడమే కాకుండా, ఇప్పటికీ అది ‘గొర్రె మాంసాన్ని’ సూచిస్తుంది.
ఇప్పుడు మీకు ఒక సందేహం రావచ్చు. ‘మటన్’ అంటే గొర్రె మాంసం అయితే, మేక మాంసాన్ని ఏమంటారు? మేక మాంసాన్ని ‘చెవాన్’ (Chevon) అంటారు. అలాగే చిన్న మేక పిల్ల మాంసాన్ని ‘కాబ్రిటో’ (Cabrito) అంటారు. ఇవి కూడా ఫ్రెంచ్ భాష నుండి వచ్చినవే. కానీ, ప్రపంచవ్యాప్తంగా మేక మాంసాన్ని ‘గోట్ మీట్’ (Goat Meat) అని పిలిచే పద్ధతి ఉండటం వల్ల, చెవాన్ మరియు కాబ్రిటో అనే పదాలు అంతగా ప్రాచుర్యం పొందలేదు.
అదే సమయంలో, బ్రిటన్, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ వంటి దేశాల్లో ‘మటన్’ అనే పదానికి వేర్వేరు అర్థాలు ఉన్నాయి. అక్కడ ముదిరిన గొర్రె మాంసాన్ని ‘మటన్’ అని, లేత గొర్రె పిల్ల మాంసాన్ని ‘లాంబ్’ (Lamb) అని, మేక మాంసాన్ని ‘గోట్ మీట్’ అని పిలుస్తారు. కాబట్టి, ఆ దేశాల్లో మటన్ అని అడిగితే గొర్రె మాంసమే ఇస్తారు.
కానీ, ఐరోపా వెలుపల కొన్ని ప్రాంతాల్లో ‘మటన్’ అనే పదాన్ని మేక మాంసాన్ని సూచించడానికి ఉపయోగించడం మొదలైంది. బ్రిటిష్ వారి పరిపాలన సమయంలో ఈ పద్ధతి మన దేశానికి కూడా పాకింది. మన దేశంలో గొర్రెల కంటే మేకల పెంపకం ఎక్కువ. మేకలను పెంచడం సులభం కావడంతో, ప్రజలు మేక మాంసాన్ని ఎక్కువగా తింటారు. అందువల్ల, బ్రిటిష్ కాలంలో మన దేశంలో సులభంగా దొరికే మేక మాంసాన్ని సూచించడానికి ‘మటన్’ అనే పదాన్ని వాడటం మొదలుపెట్టారు.
అందుకే మన దేశంలో మటన్ కర్రీ, మటన్ బిర్యానీ అంటే ప్రధానంగా మేక మాంసాన్ని ఉద్దేశించి చేసినవే. కాలక్రమేణా, మేక మరియు గొర్రె – రెండింటికీ ‘మటన్’ అనే పదాన్ని వాడటం అలవాటుగా మారింది. అందుకే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎక్కడైనా ‘మటన్’ అని అడిగితే వెంటనే ఆ మాంసాన్ని ఇస్తారు, అది ఎక్కువగా మేక మాంసమే అయి ఉంటుంది. మీకు గొర్రె మాంసమే కావాలంటే ప్రత్యేకంగా అడగాలి. కాబట్టి మన దేశంలో ‘మటన్’ అనే పదంలో ఎటువంటి గందరగోళం లేదు. కానీ విదేశాలకు వెళ్ళినప్పుడు మాత్రం ఈ తేడాలను తెలుసుకోవడం మంచిది.
