హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్ కోర్టు ప్రాంగణంలో 14 ఏళ్ల బాలికకు సంబంధించి ఒక దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది.
కొద్ది రోజుల క్రితం ఇంటి నుంచి అదృశ్యమైన సదరు బాలికను శుక్రవారం పోలీసులు గుర్తించారు. విచారణలో తను మేనత్త ఇంటికి వెళ్లినట్లు బాలిక తెలిపింది. అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి, శనివారం వాంగ్మూలం నమోదు చేసేందుకు పోలీసులు కోర్టుకు తీసుకువచ్చారు. అయితే, మెడికల్ రిపోర్టుల ద్వారా తాను గర్భం దాల్చినట్లు తెలియడంతో బాలిక తీవ్ర భయాందోళనకు గురైనట్లు పోలీసులు పేర్కొన్నారు.
కోర్టులో ఉన్న సమయంలో తనకు ఆరోగ్యం సరిగా లేదని బాలిక చెప్పడంతో, ఆమె వెంట ఉన్న మహిళా కానిస్టేబుల్ ఆమెను వాష్‌రూమ్‌కు తీసుకెళ్లారు. మహిళా కానిస్టేబుల్ బయట వేచి ఉండగా, లోపలికి వెళ్లిన బాలిక కిటికీ తెరిచి కిందకు దూకేసింది. మూడో అంతస్తు నుంచి దూకిన బాలిక నేరుగా నేలపై పడకుండా, కింద ఉన్న రేకుల షెడ్డుపై పడటంతో ప్రాణాపాయం తప్పింది. అయితే తీవ్ర గాయాలయ్యాయి.
పెద్ద శబ్దం రావడంతో కోర్టు ఆవరణలోని న్యాయవాదులు, సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో బాలికను రక్షించి సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందుతోంది. ఘటన జరిగిన వాష్‌రూమ్ కిటికీకి ఎలాంటి రక్షణ గ్రిల్స్ లేకపోవడాన్ని గుర్తించిన పోలీసులు, కోర్టు భద్రతా ఏర్పాట్లపై కూడా దృష్టి సారించారు.
మైనర్ బాలిక గర్భం దాల్చడానికి గల కారణాలు, దీని వెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు పోక్సో (POCSO) చట్టం కింద సమగ్ర విచారణ ప్రారంభించారు. బాలిక అదృశ్యం కావడం, మేనత్త ఇంట్లో ఉండటం, వైద్య పరీక్షల నివేదికల ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply