ఖాట్మండు: నేపాల్ రాజధాని ఖాట్మండులో అక్రమ నివాసాలపై జరుగుతున్న బుల్డోజర్ల దాడిలో వేలాది కుటుంబాల వేదనను ఒక 11 ఏళ్ల బాలిక రాసిన భావోద్వేగ లేఖ కళ్లకు కట్టింది.
నేపాల్ ప్రధాని బాలెన్ షాకు లేఖ రాస్తూ.. తమ కుటుంబం ఎన్నికల్లో మీ పార్టీకే ఓటు వేసినప్పుడు, తమ ఇంటిని ఎందుకు కూల్చేశారని ఆ బాలిక ప్రశ్నించింది. మూడవ తరగతి చదువుతున్న రాధికా మహతో తన లేఖలో ఇలా రాసింది: “మా కుటుంబం మార్చి 5న జరిగిన ఎన్నికల్లో మీ పార్టీకి, ‘గంట’ గుర్తుకు ఓటు వేసింది. మరి మా ఇల్లు ఎందుకు కూల్చేశారు? ఇప్పుడు మేము ఎక్కడ ఉండాలి? ఎలా చదువుకోవాలి?”
‘మా పరిస్థితిని మరింత దిగజార్చారు’
ఆన్లైన్ న్యూస్ పోర్టల్ ‘రతోపాటి’ బుధవారం ఈ భావోద్వేగ లేఖలోని కొన్ని భాగాలను ప్రచురించింది. “మా దగ్గర అద్దెకు ఇల్లు తీసుకునేంత డబ్బు లేదు. మీరు మా పరిస్థితిని మరింత దిగజార్చారు” అని రాధిక పేర్కొంది. మూడు వారాల క్రితం వరకు రాధిక ఖాట్మండులోని థాపాతలి ప్రాంతంలో ఉన్న గుహేశ్వరి బాల శిక్ష సెకండరీ స్కూల్లో చదువుకునేది. ఆమె కుటుంబం అక్కడ ఒక తాత్కాలిక గుడిసెలో ఉండేది. కానీ యంత్రాంగం బుల్డోజర్లతో ఆ నివాసాలను తొలగించింది. ప్రస్తుతం ఆ కుటుంబాలను ఖాట్మండుకు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న బనేపా మునిసిపాలిటీలోని తాత్కాలిక శిబిరానికి తరలించారు.
‘మా కోసం స్కూల్ ఏర్పాటు చేయండి’
ఇల్లు కోల్పోవడంతో రాధిక చదువు కూడా ఆగిపోయింది. “మాకు చదువుకోవడానికి స్కూల్ కావాలి. ఉండటానికి చోటు, చదువు కొనసాగించడానికి పాఠశాల సౌకర్యం కల్పించండి” అని ఆమె ప్రధానికి విజ్ఞప్తి చేసింది. గత రెండు వారాల్లో ప్రభుత్వం ఖాట్మండులో 15 వేల మందికి పైగా భూమి లేని పేదలను ఖాళీ చేయించింది. సుమారు 4 వేల తాత్కాలిక ఇళ్లను కూల్చివేసింది. ఇవి ప్రభుత్వ భూమిలో, నదీ తీరాల్లో అక్రమంగా నిర్మించారని ప్రభుత్వం చెబుతోంది. అయితే పునరావాసం కల్పించకుండా చేస్తున్న ఈ చర్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
బాలెన్ షా ఆదేశాలపై వెల్లువెత్తుతున్న నిరసనలు
మానవ హక్కుల కార్యకర్తలు, సామాజిక సంస్థలు మరియు ప్రతిపక్షాలు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. ఈ వ్యవహారం నేపాల్ సుప్రీంకోర్టుకు కూడా చేరింది. సరైన పునరావాస ప్రణాళిక లేకుండా మురికివాడల నివాసితులను తొలగించవద్దని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజల నివాసం, విద్య, ఆరోగ్యం వంటి రాజ్యాంగ హక్కులను కాపాడాలని జస్టిస్ కుమార్ రెగ్మీ, నిత్యానంద పాండేలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
ప్రభుత్వం మాత్రం పట్టణ అభివృద్ధి కోసం ప్రభుత్వ భూములను ఖాళీ చేయించడం అవసరమని వాదిస్తోంది. ఈ బుల్డోజర్ చర్యలపై ఆగ్రహం ఖాట్మండు దాటి ఇతర నగరాలకు కూడా పాకింది. పోఖరాలో వందలాది మంది భూమి లేని ప్రజలు కాగడాల ప్రదర్శన నిర్వహించి, ప్రధాని బాలెన్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
