రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్‌లో కూతురి పెళ్లి రోజే తండ్రి ఆకస్మికంగా మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. కుమార్తె వివాహం కోసం ఎంతో సంతోషంగా ఏర్పాట్లు చేస్తున్న 51 ఏళ్ల శంకర్‌లాల్ మేఘ్వాల్, పెళ్లి వేడుకల సమయంలో గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయారు. కూతురి పెళ్లి రోజే తండ్రి మృతి చెందడంతో, ఆనందంతో కళకళలాడాల్సిన ఆ ఇల్లు శోకసంద్రంలో మునిగిపోయింది.
ఉదయ్‌పూర్ జిల్లా రిషబ్దేవ్ సబ్-డివిజన్ పరిధిలోని పటియార్ (భూధర్) గ్రామానికి చెందిన శంకర్‌లాల్, అహ్మదాబాద్‌లోని ఒక ప్రైవేట్ సంస్థలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు ప్రియాంక అనే కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమార్తె ప్రియాంక వివాహం నవంబర్ 20న జరగాల్సి ఉంది. దీనికోసం శంకర్‌లాల్ ఎంతో ఉత్సాహంగా పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కూతురి పెళ్లి ఊరేగింపులోనూ ఎంతో ఆనందంగా పాల్గొని ఆడిపాడారు.
వివాహ క్రతువు జరుగుతుండగా, ఊరేగింపు ముగిసిన సుమారు గంట తర్వాత శంకర్‌లాల్‌కు అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే బంధువులు ఆయన్ను రిషబ్దేవ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో, మెరుగైన చికిత్స కోసం ఉదయ్‌పూర్‌లోని ఎం.బీ. ఆసుపత్రికి రిఫర్ చేశారు. అయితే, అక్కడ పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు.
కూతురి పెళ్లికి ఎలాంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో, ఈ విషాద వార్తను వెంటనే వధువుకు చెప్పడానికి కుటుంబ సభ్యులు ఇష్టపడలేదు. శంకర్‌లాల్ మృతదేహాన్ని ఆసుపత్రి మార్చురీలో ఉంచి, వరుడి తరపు ముఖ్య బంధువులకు మాత్రమే జరిగిన విషయాన్ని తెలియజేశారు. తండ్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మాట్లాడలేకపోతున్నారని తల్లికి, కూతురికి నచ్చజెప్పారు. అనంతరం నిరాడంబరంగా వివాహ తంతును పూర్తి చేసి, నవంబర్ 21న శంకర్‌లాల్ అంత్యక్రియలు నిర్వహించారు. కూతురి జీవితంలో మధుర జ్ఞాపకంగా మిగిలిపోవాల్సిన పెళ్లి రోజు, ఆ కుటుంబానికి జీవితాంతం మర్చిపోలేని విషాదంగా మిగిలిపోయింది.

Leave a Reply