మ్యాచ్ జరుగుతుండగా బంతి తలకు బలంగా తగలడంతో 18 ఏళ్ల యువ ఫుట్‌బాల్ ఆటగాడు ఏబెల్ నూనెజ్ ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
ప్రత్యర్థి డిఫెండర్ క్లియర్ చేసిన బంతి తలకు తగలడంతో యువ ఆటగాడు మృతి చెందిన ఈ విషాద ఘటనను, ప్రత్యక్ష సాక్షి ఒకరు బాక్సింగ్‌లోని ‘నాకౌట్’తో పోల్చారు. మైదానంలో కుప్పకూలిన ఏబెల్ నూనెజ్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి శస్త్రచికిత్స చేసినప్పటికీ, ప్రాణాలతో పోరాడి ఓడిపోయాడు. 18 ఏళ్ల ఏబెల్, అర్జెంటీనాకు చెందిన యూత్ జట్టు ఎఫ్‌సీ ఈజీజా (FC Ezeiza) తరఫున డెపోర్టివో మునిజ్తో జరిగిన మ్యాచ్‌లో ఆడుతున్నాడు.
ఆ యువకుడు కిందపడిపోవడాన్ని కళ్లారా చూసిన స్థానిక క్రీడా జర్నలిస్ట్ క్రిస్టియన్ రోంబాని మాట్లాడుతూ, “అది చాలా ప్రశాంతమైన మ్యాచ్ అయినప్పటికీ, కాస్త గందరగోళంగా సాగింది. ఒత్తిడిలో ఉన్న మునిజ్ డిఫెండర్ బంతిని బయటకు తన్నాడు. అతనికి అప్పుడు అదే ఏకైక మార్గం. కానీ అతను అసాధారణమైన శక్తితో బంతిని తన్నాడు. జూనియర్ ఫుట్‌బాల్‌లో నా దాదాపు 30 ఏళ్ల అనుభవంలో అలాంటి కిక్‌ను నేనెప్పుడూ చూడలేదు. బంతి ఎక్కువ ఎత్తుకు వెళ్లకుండా, కేవలం నాలుగైదు మీటర్ల దూరంలోనే ఏబెల్ తలకు బలంగా తగిలింది. అది అచ్చం నాకౌట్ లాగే అనిపించింది. ఆ కుర్రాడు పూర్తిగా స్పృహ కోల్పోయి కుప్పకూలిపోయాడు” అని వివరించాడు.
క్రిస్టియన్ ఇంకా మాట్లాడుతూ, “అదొక గందరగోళ క్షణం. వైద్యుడు మోకాళ్లపై కూర్చుని అతన్ని పరీక్షించాడు, కానీ అతన్ని కదల్చలేదు. ఏం గమనించారని నేను అడగ్గా, అతని శ్వాస అసాధారణంగా ఉందని చెప్పాడు. నేను ఇప్పటికీ ఆ షాక్ నుంచి కోలుకోలేదు” అన్నాడు. అంతకుముందు, శస్త్రచికిత్స అవసరమైన క్లిష్ట సమయంలో అతను త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ క్లబ్ మద్దతు ప్రకటించింది.
అనంతరం 10వ నంబర్ జెర్సీ ధరించిన నూనెజ్ ఫోటోతో క్లబ్ విడుదల చేసిన సంతాప పోస్ట్‌లో, “ఒక క్లబ్‌గా మేము ఇప్పటివరకు పంచుకోవాల్సి వచ్చిన అత్యంత కష్టమైన వార్త ఇదే. ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఓ యువకుడికి తీవ్ర వేదనతో, అంతులేని దుఃఖంతో వీడ్కోలు పలుకుతున్నాం. ఈ లోటు వర్ణించలేని శూన్యాన్ని మిగిల్చింది. మ్యాచ్‌లో మా ఈజీజా జెర్సీని గర్వంగా ధరించి ఆడుతున్న సమయంలో జరిగిన తీవ్ర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన అతనికి మా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. ఈరోజు ఫుట్‌బాల్ వెనుకబడిపోయింది. ఎన్నో కలలు, లక్ష్యాలతో మా కుటుంబంలో ప్రియమైన సభ్యుడిగా ఉన్న సహచర ఆటగాడికి వీడ్కోలు పలికే బాధలో మేము మునిగిపోయాము” అని పేర్కొంది.

Leave a Reply