బీహార్: సమస్తిపూర్ జిల్లాలోని విభూతిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాధోపూర్ గ్రామంలో ఒక వింత ఘటన చోటుచేసుకుంది. ఒక వివాహిత, తన ప్రియుడితో కలిసి మొక్కజొన్న చేలో ఉండగా గ్రామస్థులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వెంటనే అక్కడికక్కడే పంచాయతీ పెట్టి, గ్రామ పెద్దల సమక్షంలో ఇద్దరికీ వివాహం జరిపించారు. ఈ వింత పెళ్లి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అసలు కథ ఇదీ: పెళ్లి చేసుకున్న ఆ మహిళ పేరు రాధని (30). ఏడేళ్ల క్రితం ఆమెకు రాధోపూర్ గ్రామానికి చెందిన మనీష్ కుమార్‌తో వివాహమైంది. వీరికి ఐదేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అయితే, మనీష్ బతుకుదెరువు కోసం హర్యానాకు వెళ్లి, గత ఐదేళ్లుగా ఇంటికి తిరిగి రాలేదు. అప్పుడప్పుడు తన తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడినప్పటికీ, భార్యాపిల్లలతో మాత్రం ఎటువంటి సంబంధం పెట్టుకోలేదు. దీంతో రాధని తన పుట్టింటికి వెళ్లిపోయింది.
సోషల్ మీడియాలో మొదలైన ప్రేమ: పుట్టింట్లో ఉన్న సమయంలో, పక్కనే ఉండే మయాంక్ (25) అనే యువకుడితో రాధనికి పరిచయం ఏర్పడింది. ఇది సోషల్ మీడియా మరియు ఫోన్ కాల్స్ ద్వారా ప్రేమగా మారింది. తరచూ రహస్యంగా కలుసుకుంటున్న వీరు, బుధవారం సాయంత్రం మొక్కజొన్న చేలో ఉండగా గ్రామస్థులకు పట్టుబడ్డారు.
కొడుకుతో సహా అత్తారింటికి..: గ్రామస్థులంతా కలిసి గురువారం వారిద్దరికీ వివాహం జరిపించారు. మయాంక్ చేత ఆమె నుదుట సింధూరం పెట్టించి, సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి తంతు పూర్తి చేశారు. అత్యంత భావోద్వేగమైన విషయం ఏమిటంటే, ఆ వివాహితను ఆమె ఐదేళ్ల కొడుకుతో సహా గ్రామస్థులు మయాంక్ ఇంటికి సాగనంపారు. భర్త బతికే ఉన్నా, పంచాయతీ పెట్టి మరీ గ్రామస్థులు జరిపించిన ఈ పెళ్లి ఇప్పుడు ఆ ప్రాంతంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
