ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు వైద్యం, అంతరిక్షం వంటి అనేక రంగాల్లో పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. క్యాన్సర్ మందులు, కృత్రిమ మెదడు వంటి ఎన్నో ఆవిష్కరణలు వచ్చాయి. తాజాగా ఆ జాబితాలోకి మరో అరుదైన ఘనత వచ్చి చేరింది.
మొక్కలకు ప్రాణం ఉంటుందని, అవి శ్వాసిస్తాయని మనందరికీ తెలుసు. అయితే, మొక్కలు శ్వాసించడాన్ని ఇప్పటివరకు ఏ శాస్త్రవేత్తా ప్రత్యక్షంగా చూడలేదు లేదా నిరూపించలేదు. తాజాగా అమెరికా శాస్త్రవేత్తలు చరిత్రలో మొదటిసారిగా మొక్కలు శ్వాసించే అద్భుతాన్ని లైవ్ వీడియో ద్వారా చిత్రీకరించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు.
స్టోమాటా (Stomata) అంటే ఏమిటి? సాధారణంగా మొక్కల ఆకుల్లో వేలాది చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. వీటిని ‘స్టోమాటా’ (పత్రరంధ్రాలు) అంటారు. వీటి ద్వారానే మొక్కలు గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహించి, ఆక్సిజన్‌ను మరియు నీటిని బయటకు వదులుతాయి.
శాస్త్రవేత్తల ఘనత: అమెరికాలోని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ‘స్టోమాటా ఇన్-సైట్’ (Stomata In-sight) అనే కొత్త పరికరాన్ని రూపొందించారు. అత్యాధునిక ‘కాన్ఫోకల్ మైక్రోస్కోప్’ మరియు ‘మెషిన్ లెర్నింగ్’ సాఫ్ట్వేర్లను అనుసంధానించి దీనిని తయారు చేశారు.
ఈ పరికరం ద్వారా ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు లేదా తేమ తగ్గినప్పుడు, నీటిని నష్టపోకుండా ఉండేందుకు మొక్కలు తమ రంధ్రాలను ఎలా మూసివేసుకుంటాయో స్పష్టంగా చూడవచ్చు. సుమారు 5 ఏళ్ల కఠోర శ్రమ తర్వాత ఈ అరుదైన దృశ్యాన్ని శాస్త్రవేత్తలు రికార్డు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
