మొదటి భర్త తరపున రెండో భర్త సాక్ష్యం.. 17 ఏళ్ల గృహహింస కేసులో మహిళకు చుక్కెదురు!

ముంబై మెజిస్ట్రేట్ కోర్టులో 17 ఏళ్లుగా సాగుతున్న ఒక గృహహింస కేసులో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. ఒక మహిళ వేసిన పరిహారం పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. దీనికి కారణం, ఆమె ప్రస్తుత భర్త తన భార్య మాజీ భర్త తరపున సాక్ష్యం చెప్పడమే.

మీడియా నివేదికల ప్రకారం, ఆ మహిళ 2009లో తన మొదటి భర్తపై గృహహింస కేసు పెట్టింది. తన భర్త తనను శారీరకంగా, మానసికకంగా మరియు ఆర్థికంగా వేధించాడని, ఇంటి నుండి గెంటేశాడని ఆమె ఆరోపించింది. 2005లో వివాహమయ్యాక, తన భర్తకు అప్పటికే పెళ్లయిందని తెలిసిందని, భర్త మరియు అతని మొదటి భార్య కలిసి తనను హింసించారని ఆమె కోర్టుకు తెలిపింది. దీనిపై స్పందించిన కోర్టు 2009లో ఆమెకు నెలకు రూ. 3,200 మధ్యంతర భరణం చెల్లించాలని మొదటి భర్తను ఆదేశించింది.

విచారణ సమయంలో, ఆ మహిళ తన సోదరిని సాక్షిగా ప్రవేశపెట్టింది. అయితే మొదటి భర్త ఈ ఆరోపణలను తోసిపుచ్చుతూ.. తమకు 2008లోనే విడాకులయ్యాయని, ఆమె తన ఇష్టపూర్వకంగానే ఇంటి నుండి వెళ్లిపోయిందని వాదించాడు. అంతేకాకుండా, విడాకుల తర్వాత ఆమె రెండో పెళ్లి చేసుకుందని ఆరోపించాడు.

తన వాదనను నిరూపించడానికి అతను ఆమె రెండో పెళ్లికి సంబంధించిన ‘నికానామా’, పెళ్లి జరిపించిన ఇమామ్ సాక్ష్యం, చేతిరాత నిపుణుల నివేదిక మరియు అన్నింటికంటే ముఖ్యంగా ఆ మహిళ రెండో భర్తను కోర్టులో సాక్షిగా ప్రవేశపెట్టాడు.

రెండో భర్త కోర్టుకు వచ్చి, తమ పెళ్లి జరిగిన మాట వాస్తవమేనని ధృవీకరించడంతో కేసు ఒక్కసారిగా మలుపు తిరిగింది. అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ బి.ఎన్. చిక్నే ఈ సాక్ష్యాల ఆధారంగా తీర్పునిస్తూ.. రెండో పెళ్లి చేసుకున్న మహిళ తన మాజీ భర్త నుండి భరణం పొందే అర్హతను కోల్పోతుందని స్పష్టం చేశారు. దీంతో 17 ఏళ్లుగా సాగుతున్న ఆమె దరఖాస్తును కోర్టు కొట్టివేసింది.


Posted

in

by

Tags: