హిందీ టీవీ సీరియల్స్‌తో గుర్తింపు పొందిన ప్రముఖ నటుడు నందీష్ సంధు (Nandish Sandhu), తన 44 ఏళ్ల వయసులో రెండో వివాహం చేసుకున్నాడు.
తన ప్రియురాలు, నటి అయిన కవితా బెనర్జీని పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీలో నవంబర్ 14న సంప్రదాయ బెంగాలీ పద్ధతిలో అతడు పెళ్లాడాడు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వివాహం ఘనంగా జరిగింది. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ వివాహానికి ముందు నవంబర్ 13న నిశ్చితార్థం, సంగీత్ వేడుకలు జరిగాయి. మరుసటి రోజు హల్దీ (పసుపు) వేడుక తర్వాత పెళ్లి జరిగింది. పెళ్లిలో కవిత ఎరుపు, క్రీమ్ కలర్ బనారస్ పట్టుచీరలో వధువుగా మెరిసిపోగా.. నందీష్ క్రీమ్ కలర్ ధోతీ, చొక్కా ధరించాడు. వీళ్లిద్దరూ గత 2025లోనే నిశ్చితార్థం చేసుకున్నారు.
నందీష్ సంధు మొదటి వివాహం ప్రముఖ నటి రష్మీ దేశాయ్‌తో జరిగింది. ఒక పాపులర్ టీవీ సీరియల్‌లో కలిసి నటిస్తున్నప్పుడు వీరి మధ్య ప్రేమ చిగురించింది. 2012లో పెళ్లి చేసుకున్న వీరు, మనస్పర్థల కారణంగా 2014లో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత 2016లో చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు. అయితే, ఈ వైవాహిక జీవితంలో నందీష్ తనను వేధించాడని రష్మీ అప్పట్లో తీవ్ర ఆరోపణలు చేసింది.
ఈ ఆరోపణలపై నందీష్ ఆ తర్వాత స్పందిస్తూ.. తమ మధ్య అవగాహన, సర్దుబాటు లోపించడమే విడిపోవడానికి కారణమని, ఇద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నామని తెలిపాడు. తన గురించి వచ్చిన కొన్ని ఆరోపణలు తనను మానసికంగా కుంగదీశాయని కూడా చెప్పాడు. ఏది ఏమైనప్పటికీ, విడాకులు తీసుకున్న సుమారు 10 ఏళ్ల తర్వాత నందీష్ మళ్లీ పెళ్లి చేసుకోవడం ఇప్పుడు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.

Leave a Reply