గుజరాత్: జునాగఢ్ నగరంలో కురిసిన మొదటి వర్షానికే అక్కడి మున్సిపల్ కార్పొరేషన్ నిర్లక్ష్యం, రోడ్ల దుస్థితి బయటపడింది. ఇది స్థానికంగానే కాకుండా, సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తోంది.
ఏం జరిగింది? నగరంలోని పలు ప్రధాన రహదారులపై భారీ వర్షానికి నీరు నిలిచిపోయింది. దీనివల్ల అక్కడ ఉన్న ఓపెన్ మాన్హోల్స్ (డ్రైనేజీ రంధ్రాలు), ప్రమాదకరమైన గుంతలు పూర్తిగా నీటిలో కలిసిపోయి కనిపించకుండా పోయాయి. రోడ్డుపై ఏం జరుగుతుందో తెలియక అటుగా వెళ్తున్న పాదచారులు, వాహనదారులు వరుసగా ఆ గుంతల్లో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ దారుణమైన ఘటనకు సంబంధించిన రెండు సీసీటీవీ దృశ్యాలు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి.
భయాందోళన కలిగించే దృశ్యాలు.. ఒక వీడియోలో, బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు నీటిలో నిండి ఉన్న డ్రైనేజీ గుంతను గమనించక అందులో పడిపోయారు. వారిని చూసి షాక్కు గురైన స్థానికులు వెంటనే స్పందించి వారిని రక్షించారు. అదే గుంతలో వరుసగా ఒక మహిళ, ఒక చిన్నారి మరియు యాక్టివాపై వచ్చిన వ్యక్తి కూడా పడిపోయి గాయపడ్డారు. వారందరినీ స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.
మరో ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టి, వాటిని సరిగ్గా పూడ్చకపోవడంతో.. అక్కడ కూడా నిలిచిన నీటిలో పడి అనేకమంది మహిళలు, పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు.
నెటిజన్ల ఆగ్రహం.. ఈ వీడియోలు చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “ప్రతి ఏటా వర్షాలకు ముందు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతారు, కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అధ్వాన్నంగా ఉంది” అని విమర్శిస్తున్నారు. కనీసం ప్రమాద హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై చర్యలు చేపట్టాలని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.
