అగ్రరాజ్యం అమెరికా ఇరాన్‌ను తక్కువ అంచనా వేసింది. ఒక చిన్న దేశం నుండి ఇంతటి సవాలు ఎదురవుతుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊహించలేదు. అమెరికా క్షిపణి దాడులతో ఇరాన్ ఆర్థిక వెన్నెముకను విరచాలని చూస్తుంటే, ఇరాన్ మాత్రం యుద్ధాన్ని ‘హార్ముజ్ జలసంధి’కి మళ్లించి ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే గడగడలాడిస్తోంది.
ప్రపంచానికి ‘హార్ముజ్’ ఎందుకు ముఖ్యం?
గ్లోబల్ సప్లై చైన్‌కు హార్ముజ్ జలసంధి ఒక జీవనాడి వంటిది. ప్రపంచ ముడి చమురు సరఫరాలో 20% ఈ మార్గం గుండానే సాగుతుంది. 2025 గణాంకాల ప్రకారం, ప్రతిరోజూ 2 కోట్ల బ్యారెళ్ల చమురు ఇక్కడి నుండి రవాణా అవుతుంది. ఈ మార్గాన్ని ఇరాన్ అడ్డుకోవడంతో చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనివల్ల అమెరికాకు గత 6 రోజుల్లోనే సుమారు రూ. 1.04 లక్షల కోట్ల ($11.3 బిలియన్లు) నష్టం వాటిల్లింది.
భారత్‌పై దీని ప్రభావం ఏమిటి?
హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే చమురులో 74% వాటా చైనా, జపాన్, దక్షిణ కొరియా మరియు భారత్‌లదే.
భారత్‌కు అవసరమైన చమురులో 50%, గ్యాస్‌లో 60% ఈ మార్గం ద్వారానే వస్తుంది.
ప్రస్తుతం ఈ మార్గం మూతపడటంతో సరఫరా వ్యవస్థ దెబ్బతిన్నది.
భారత్ వద్ద ఎన్ని రోజుల నిల్వలు ఉన్నాయి?
ప్రభుత్వ గణాంకాల ప్రకారం, భారత్ వద్ద ప్రస్తుతం 7 నుండి 8 వారాల (50 నుండి 60 రోజులు) అవసరాలకు సరిపడా ‘ఆయిల్ రిజర్వ్’ ఉంది. అంటే మన దగ్గర సుమారు 25 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు నిల్వ ఉంది.
ముప్పు: యుద్ధం 50 రోజులు దాటి కొనసాగితే భారత్‌కు కష్టాలు మొదలవుతాయి. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు తెచ్చుకున్నా, రవాణా మరియు ఇన్సూరెన్స్ ఖర్చులు పెరగడం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.
భారత్ తీసుకుంటున్న జాగ్రత్తలు:
పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపిన వివరాల ప్రకారం, భారత్ హార్ముజ్ జలసంధిపై ఆధారపడటాన్ని తగ్గించింది:
దిగుమతుల్లో మార్పు: గతంలో 45% దిగుమతులు హార్ముజ్ ద్వారా వచ్చేవి. ఇప్పుడు దానిని తగ్గించి, 70% దిగుమతులను ఇతర సురక్షిత మార్గాల ద్వారా భారత్ పొందుతోంది.
కొత్త వనరులు: భారత్ ఇప్పుడు 40 దేశాల నుండి చమురు కొంటోంది. రష్యా, ఇరాక్, సౌదీ అరేబియా, UAE, అమెరికా కాకుండా.. వెనిజులా, నైజీరియా, బ్రెజిల్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల నుండి కూడా సరఫరాను పొందుతోంది.
ప్రస్తుత పరిస్థితి: దేశంలో పెట్రోల్, డీజిల్ లేదా వంట గ్యాస్ కొరత ఏమీ లేదని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. అయితే అంతర్జాతీయంగా ధరలు పెరిగితే ఆ భారం సామాన్యులపై పడే అవకాశం ఉంది.
