“మోదీ దీపావళి కానుక రూ. 8,000 నిజమేనా?”.. ప్రధాని పేరుతో సరికొత్త ఆన్‌లైన్ మోసం.. వాట్సాప్ యూజర్లకు సైబర్ పోలీసుల అత్యవసర హెచ్చరిక..!!!

దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ పేరుతో దేశంలోని ప్రతి పౌరుడికి రూ. 8,000 ఉచితంగా కానుకగా ఇస్తున్నట్లు వాట్సాప్ మరియు ఇతర సోషల్ మీడియా వేదికలలో ఒక వార్త అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకం లాంటి నకిలీ రూపాన్ని సృష్టించి, ఆ మెసేజ్‌లో ఇచ్చిన అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేసేలా చేసి.. ప్రజలను మోసగించే ఉద్దేశంతో సైబర్ నేరగాళ్లు ఈ సరికొత్త మోసానికి తెరతీశారు.

ఈ నకిలీ లింక్‌లను ఓపెన్ చేసినప్పుడు.. వ్యక్తిగత బ్యాంక్ ఖాతా వివరాలు, మొబైల్ నంబర్, రహస్య ఓటీపీ (OTP) మరియు యూపీఐ (UPI) పిన్ నంబర్లను నమోదు చేయమని అడుగుతారు. వీటిని నమోదు చేస్తే, బ్యాంక్ ఖాతా నుంచి తక్షణమే డబ్బులు దొంగిలించబడటమే కాకుండా, మొబైల్‌లో హానికరమైన సాఫ్ట్‌వేర్‌లు (మాల్‌వేర్) డౌన్‌లోడ్ అయి వ్యక్తిగత డేటా భద్రతకు పెనుముప్పు వాటిల్లుతుందని సైబర్ క్రైమ్ పోలీసులు తీవ్రంగా హెచ్చరించారు.

ప్రభుత్వ సంబంధిత సహాయాలు, ప్రకటనలకు సంబంధించి అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారా మాత్రమే ప్రజలు నిజానిజాలను నిర్ధారించుకోవాలని, గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే అనుమానాస్పద లింక్‌లను ఇతరులకు షేర్ చేయవద్దని పోలీసులు కోరుతున్నారు. పొరపాటున ఇలాంటి నకిలీ లింక్‌లపై క్లిక్ చేసి డబ్బులు పోగొట్టుకుంటే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ‘1930’ టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి గానీ, లేదా సైబర్ క్రైమ్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా గానీ ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.


Posted

in

by

Tags: