మోదీ-షాలకు తలనొప్పిగా మారిన యూజీసీ కొత్త నిబంధనలు! బీజేపీకి పలువురు నేతల రాజీనామా, పార్టీలో కలకలం.

ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) తీసుకువచ్చిన కొత్త నిబంధనలకు నిరసనగా లక్నోలో 11 మంది బీజేపీ పదాధికారులు తమ పదవులకు రాజీనామా చేశారు. లక్నో జిల్లాలోని కుంహరావా మండలం జనరల్ సెక్రటరీ అంకిత్ తివారీతో పాటు మరో 10 మంది సభ్యులు సామూహిక రాజీనామాలు సమర్పించడం పార్టీలో అంతర్గత కలహాలను బయటపెట్టింది.

అంకిత్ తివారీ రాజీనామా లేఖలో ఏముంది? పార్టీ తన మూల సిద్ధాంతాలైన పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ, శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఆశయాల నుండి పక్కకు తప్పుతోందని అంకిత్ తివారీ ఆరోపించారు. యూజీసీ చట్టాన్ని అమలు చేయాలనే నిర్ణయం భవిష్యత్తుకు నష్టదాయకమని, ఇది ఒక “వినాశకరమైన అడుగు” అని ఆయన విమర్శించారు.

యూజీసీ కొత్త నిబంధనలు ఏమిటి? జనవరి 15, 2026 నుండి యూజీసీ కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. విద్యాసంస్థల్లో కులం, లింగం లేదా నేపథ్యం ఆధారంగా జరిగే వివక్షను అరికట్టడం దీని ప్రధాన ఉద్దేశ్యం. 2012 నాటి పాత నిబంధనల స్థానంలో మరింత కఠినమైన నియమాలను తీసుకువచ్చారు. దీని ప్రకారం ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలో ఒక ‘ఈక్విటీ సెల్’ (Equity Cell) ఏర్పాటు చేయడం తప్పనిసరి.

నిరసనలకు కారణం ఏమిటి? ఈ నిబంధనల్లో ‘కులం ఆధారిత వివక్ష’ కేటగిరీలో ఓబీసీ (OBC)లను కూడా చేర్చడంపై అగ్రవర్ణాల (General Category) నుండి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఓబీసీలకు ఇప్పటికే రిజర్వేషన్ల వంటి ప్రయోజనాలు ఉన్నాయని, ఇప్పుడు వారిని కూడా ఈ వివక్ష నిరోధక కేటగిరీలో చేర్చడం ఇతరులకు అన్యాయం చేయడమేనని వీరు వాదిస్తున్నారు. అలాగే, ఈ నిబంధనలు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని, తప్పుడు ఫిర్యాదుల వల్ల విద్యార్థుల కెరీర్ దెబ్బతింటుందని కొందరు ఆందోళన చెందుతున్నారు.


Posted

in

by

Tags: