కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దారుణం జరిగింది. గతంలో 91 ఏళ్ల మోహిని త్రివేదీని కరిచి చంపిన పెంపుడు జర్మన్ షెపర్డ్ కుక్క, ఇప్పుడు ఆమె కోడలిపై దాడి చేసింది. ఆ భయంకరమైన కుక్క మొదట మహిళ కాలును కొరికి కింద పడేసింది, ఆమె తప్పించుకోవడానికి ప్రయత్నించగా రెండు చేతులను దారుణంగా కొరికి మాంసాన్ని పీకేసింది.
రక్తపు మడుగులో పడి ఉన్న తల్లిని చూసిన కొడుకు, ఎలాగోలా కుక్క నుండి ఆమెను రక్షించి రావత్పూర్లోని ఒక నర్సింగ్ హోమ్‌లో చేర్పించాడు.
అసలేం జరిగింది?
వికాస్ నగర్‌కు చెందిన ధీర్ ప్రశాంత్ త్రివేదీ బెంగళూరులో మెకానికల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అతని తల్లి కిరణ్ త్రివేదీ (70) కాన్పూర్‌లో నివసిస్తున్నారు. మే 1న ప్రశాంత్ సెలవుపై ఇంటికి వస్తూ, తన పెంపుడు జర్మన్ షెపర్డ్ కుక్క ‘రాబర్ట్’ను వెంట తెచ్చుకున్నాడు.
గత చరిత్ర: ఇదే కుక్క గత ఏడాది మార్చి 19న ప్రశాంత్ బామ్మ అయిన మోహినిని నోటితో పీకి చంపేసింది. అప్పట్లో నగర పాలక సంస్థ సిబ్బంది కుక్కను తీసుకెళ్తుంటే ప్రశాంత్ తీవ్రంగా వ్యతిరేకించాడు. ఇప్పుడు అదే కుక్క తన సొంత తల్లిపై దాడి చేసి, చేతులపై లోతైన గాయాలు చేసింది. కొన్ని చోట్ల చేతిపై మాంసం కూడా ఊడిపోయింది.
డాక్టర్లను తప్పుదోవ పట్టించే ప్రయత్నం
తల్లిని ఆసుపత్రిలో చేర్పించే సమయంలో ప్రశాంత్ అబద్ధం చెప్పాడు. కిరణ్ శరీరంలోని లోతైన గాయాలను చూసి వైద్యులు నిలదీయగా, వీధి కుక్కలు దాడి చేశాయని నమ్మబలికాడు. అయితే సోమవారం సాయంత్రం అసలు నిజం బయటపడింది.
కుక్క కోసం ఆరాటం.. ఇప్పుడు ఘోరం
గత ఏడాది బామ్మ చనిపోయినప్పుడు కూడా ప్రశాంత్ ఆ కుక్కను దక్కించుకోవడానికి మున్సిపల్ అధికారులతో గొడవపడ్డాడు. కుక్కను ముద్దాడుతూ అతను చేసిన వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
నగరపాలక సంస్థ వెటర్నరీ అధికారి డాక్టర్ ఆర్.కె. నిరంజన్ మాట్లాడుతూ.. “గత ఏడాది ఈ కుక్క వృద్ధురాలిని చంపినప్పుడు మేము దానిని పట్టుకొచ్చాం. కానీ ప్రశాంత్ ప్రతిరోజూ వచ్చి కుక్కను తిరిగి ఇచ్చేయమని బ్రతిమిలాడాడు. ఇకపై జాగ్రత్తగా ఉంటానని, కుక్కను కట్టేసి ఉంచుతానని అఫిడవిట్ (హల్ఫానామా) రాసి ఇచ్చాడు. ఒకవేళ కుక్క మళ్ళీ ఎవరినైనా కరిస్తే తనదే బాధ్యత అని ఒప్పుకున్నాడు. అందుకే తిరిగి ఇచ్చాం. ఇప్పుడు మళ్ళీ ఇలాంటి ఘోరం జరగడానికి అతడే బాధ్యుడు” అని తెలిపారు.
