ఇటలీలో ప్రధాన మంత్రి జార్జియా మెలోనీ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసన ప్రదర్శన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
వీధుల్లోకి దూసుకొచ్చిన విద్యార్థులు
పాఠశాలలకు అదనంగా నిధులు కేటాయించాలని, రక్షణ రంగానికి, ఆయుధ కొనుగోళ్లకు చేసే ఖర్చును తగ్గించాలనే ప్రధాన డిమాండ్లతో అక్టోబర్ 16న రోమ్, టూరిన్ సహా పలు ప్రధాన నగరాల్లో విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. “యుద్ధానికి కాదు, విద్యకే డబ్బు కావాలి”, “ఆయుధాల ఖర్చు తగ్గాలి, హక్కులు పెరగాలి” అంటూ నినాదాలు హోరెత్తించారు.
పాఠశాలల్లో అధ్వాన్నంగా ఉన్న మౌలిక వసతులు, విద్యా రంగానికి సంబంధించిన సమస్యలు, ప్రభుత్వ నిధుల కేటాయింపులో లోపాలు విద్యార్థుల ఆగ్రహానికి కారణాలుగా ఉన్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారడం కలకలం రేపింది. టూరిన్‌లో పోలీసులపై కొందరు రాళ్లు, గుడ్లు విసిరారని, రోమ్‌లోని విద్యాశాఖ మంత్రిత్వ శాఖ పరిసర ప్రాంతాలలో బాణసంచా, పేలుడు పదార్థాలు పేల్చినట్లు ఇటాలియన్ వార్తా సంస్థ ‘ANSA’ వెల్లడించింది.
ప్రధాని మెలోనీ స్పందన
ఈ నిరసనల సమయంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలను ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా ఖండించాలని ప్రధాని జార్జియా మెలోనీ గట్టిగా డిమాండ్ చేశారు. శాంతియుత మార్గంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందని పేర్కొన్న ఆమె.. భద్రతా సిబ్బందిపై దాడులు, అల్లర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు.
ఇటలీలో విద్యార్థులు చేపట్టిన ఈ ఆందోళన దేశంలో విద్యా రంగానికి నిధుల కేటాయింపు, రక్షణ వ్యయంపై మరోసారి చర్చకు తెరలేపింది. అదే సమయంలో, నిరసనల ముసుగులో జరుగుతున్న హింస, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసంపై ఆందోళన వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను షేర్ చేసే ముందు వాటి విశ్వసనీయతను పరిశీలించడం ఎంతైనా అవసరం.

Leave a Reply