నోయిడాలోని బీటా-2 ప్రాంతంలో ఒక పార్కు సమీపంలో యువతి మృతదేహం లభించినట్లు పోలీసులు తెలిపారు. ఈ సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
మృతురాలి కుటుంబ సభ్యులు ఆమెపై అత్యాచారం జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ యువతి తన తమ్ముడితో కలిసి అద్దె ఇంట్లో ఉంటూ, నోయిడా సెక్టార్-60లోని ఒక కాల్ సెంటర్లో పని చేస్తోంది. ఆదివారం ఉదయం ఆఫీసుకి వెళ్లిన ఆమె, రాత్రి వరకు తిరిగి రాలేదు. ఆమె తమ్ముడు పలుమార్లు ఫోన్ చేసినా ఫలితం లేదు. సోమవారం ఉదయం ఆమె మృతదేహం లభించడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
అసలేం జరిగింది?
మృతురాలి తల్లిదండ్రులు ఇప్పటికే మరణించారు. ఆమె కుటుంబంలో పెద్ద కూతురు కావడంతో తమ్ముళ్లను చూసుకుంటోంది. ఆమె తమ్ముళ్లలో ఒకరు ఆగ్రాలో ఉద్యోగం చేస్తుండగా, మరొకరు నోయిడాలో ఆమెతో పాటే ఉంటున్నారు.
ఆదివారం రాత్రి తాను మెట్రో ఎక్కానని, వస్తున్నానని తమ్ముడికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చింది. ఆ తర్వాత ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. సోమవారం ఉదయం ఒక కారు కింద ఆమె మృతదేహం కనిపించింది. ఆమె ముక్కు, నోటి నుండి రక్తం కారుతోంది. ఆమె ఒంటిపై బట్టలు కూడా సరిగ్గా లేవని, అందుకే ఆమెపై లైంగిక దాడి జరిగి ఉండవచ్చని తమ్ముడు ఆవేదన వ్యక్తం చేశాడు.
ప్రత్యక్ష సాక్షుల కథనం
మున్ని అనే ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ.. తాను ఉదయం తన కుమారుడిని స్కూల్లో దింపడానికి వెళ్తుండగా పోలీసుల బందోబస్తు చూశానని చెప్పారు. అక్కడికి వెళ్లి చూడగా ఒక కారు కింద యువతి మృతదేహం పడి ఉండటం గమనించినట్లు ఆమె తెలిపారు.
బీటా-2 పోలీస్ స్టేషన్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతి పార్కు వద్దకు ఎలా వచ్చింది? కారు కింద మృతదేహం ఎలా ఉంది? ఇది ప్రమాదమా లేక హత్యనా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
