పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు అత్యంత ప్రమాదకర మలుపు తిరిగాయి. ఇరాన్ సెంట్రల్ మిలిటరీ కమాండ్ ప్రధాన కార్యాలయం ‘ఖాతమ్ అల్-అన్బియా’, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో నివసిస్తున్న ప్రజల కోసం అత్యవసర మరియు గంభీరమైన హెచ్చరికను జారీ చేసింది.
అక్కడ నివసిస్తున్న ప్రజలు, ముఖ్యంగా నౌకాశ్రయాలు (Ports), డాక్ ఏరియాలు మరియు అమెరికాకు చెందిన సైనిక స్థావరాల సమీపంలో ఉన్నవారు ఆ ప్రాంతాలను వెంటనే ఖాళీ చేయాలని ఇరాన్ సైనిక ప్రధాన కార్యాలయం విజ్ఞప్తి చేసింది.
సామాన్య ప్రజలకు సూచన:
సాధ్యమైనంత వరకు ఈ సున్నితమైన ప్రాంతాలకు దూరంగా ఉండాలని ఇరాన్ స్పష్టం చేసింది. ఒకవేళ దాడులు జరిగితే సామాన్య ప్రజలకు ఎలాంటి ప్రాణనష్టం జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ హెచ్చరిక జారీ చేసినట్లు తెలిపింది. అమెరికా మరియు ఇరాన్ మధ్య సైనిక ఘర్షణ జరిగే అవకాశం గరిష్ట స్థాయికి చేరుకున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. తమపై దాడులు జరిగితే, ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడానికి వెనుకాడబోమని ఇరాన్ హెచ్చరించింది.
చర్చల ప్రసక్తే లేదు:
యుద్ధ భయాల మధ్య అమెరికాతో చర్చలు జరిపే అవకాశాన్ని ఇరాన్ పూర్తిగా తోసిపుచ్చింది. భారత్‌లోని ఇరాన్ సర్వోన్నత నేత ప్రతినిధి అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్ చర్చలకు సిద్ధంగా లేదు. ఈ వివాదాన్ని మొదలుపెట్టింది అమెరికాయే” అని అన్నారు. చర్చలకు ఇరాన్ ఆసక్తి చూపుతోందన్న డోనాల్డ్ ట్రంప్ వాదనలు అబద్ధమని ఆయన కొట్టిపారేశారు.
ముస్లిం దేశాలకు పిలుపు:
ముస్లిం దేశాలన్నీ ఏకం కావాలని ఇరాన్ సైన్యం పిలుపునిచ్చింది. తమ దేశంపై పడే ప్రతి రక్తపు చుక్కకు లెక్క తీర్చుకుంటామని తెలిపింది. ఎనిమిదేళ్ల ఇరాన్-ఇరాక్ యుద్ధ అనుభవం తమకు ఉందని, ఎంత కాలమైనా యుద్ధం చేసే సామర్థ్యం ఇరాన్‌కు ఉందని ఇలాహీ నొక్కి చెప్పారు. తమ మాతృభూమిని కాపాడుకోవడానికి ఇరాన్ ప్రజలు ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు.
గల్ఫ్ ప్రాంతంలో హై అలర్ట్:
ఇరాన్ నేరుగా హెచ్చరికలు జారీ చేయడంతో గల్ఫ్ దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి. భద్రతను కట్టుదిట్టం చేశారు. కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని పౌరులకు సూచించారు. ఇరాన్‌కు చెందిన ‘ఖార్గ్ ద్వీపం’పై దాడి చేస్తామన్న డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల తర్వాత పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ప్రస్తుతం ఇరాన్ ఇచ్చిన ఈ ‘ఎవాక్యుయేషన్ వార్నింగ్’ (ఖాళీ చేయాలన్న హెచ్చరిక) యూఏఈ మరియు చుట్టుపక్కల దేశాల్లో కలకలం రేపింది.
