దుబాయ్: భారతీయులు ఎక్కువగా వలస వెళ్లే దేశాల్లో యూఏఈ (అమీరాత్) ఒకటి. అయితే, గత కొన్ని నెలలుగా మధ్యప్రాచ్య దేశాల్లో యుద్ధ పరిస్థితుల కారణంగా భారత్-యూఏఈ మధ్య విమాన ప్రయాణ ఛార్జీలు ఆకాశన్నంటాయి. కానీ, ఇప్పుడు ఆ ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టడం ప్రయాణికులకు ఊరటనిస్తోంది.
విమానయాన సంస్థలు అదనపు సర్వీసులను ప్రారంభించడంతో టికెట్ ధరలు తగ్గుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యంత రద్దీగా ఉండే అంతర్జాతీయ విమాన మార్గాల్లో ‘భారత్-యూఏఈ’ రూట్ ఒకటి. ముఖ్యంగా దక్షిణాది నుండి లక్షలాది మంది ఉపాధి కోసం, వ్యాపారాల కోసం, కుటుంబ సభ్యులను కలిసేందుకు ఈ మార్గంలో ప్రయాణిస్తుంటారు.
విమాన ధరల పరిస్థితి: సాధారణంగా జూన్ నుండి ఆగస్టు వరకు పాఠశాలలకు వేసవి సెలవులు ఉండటం వల్ల విమాన టికెట్ ధరలు పెరగడం సహజం. ఈ ఏడాది కూడా గత కొన్ని వారాల క్రితం టికెట్ ధరలు తీవ్రస్థాయిలో పెరిగాయి. ముఖ్యంగా కేరళకు వెళ్లే విమానాల ధరలు 3,500 నుండి 3,600 దిర్హామ్‌ల (సుమారు ₹79,450 నుండి ₹81,720) వరకు చేరాయి. యుద్ధం కారణంగా విమాన సర్వీసులకు అంతరాయం కలగడం కూడా ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమైంది.
ప్రస్తుతం అదనపు విమానాలను నడపడం వల్ల, టికెట్ ధరలు సుమారు 2,600 దిర్హామ్‌ల (సుమారు ₹59,020) వరకు తగ్గాయని సమాచారం. ముసాఫిర్.కామ్ (Musafir.com) అధికారి రషీద్ బాబు మాట్లాడుతూ, “విమాన సర్వీసులు పెరగడం వల్ల ధరలు తగ్గాయి, అయితే గత ఏడాదితో పోలిస్తే ఇవి ఇంకా ఎక్కువే ఉన్నాయి” అని పేర్కొన్నారు.
ముందు జాగ్రత్తలు: గతంలో కంటే ధరలు తగ్గినప్పటికీ, పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి చేరుకోవడానికి కొంత సమయం పడుతుందని ట్రావెల్ ఏజెంట్లు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్ ట్రావెల్స్ జనరల్ మేనేజర్ సఫీర్ మహమూద్ మాట్లాడుతూ, “గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ధరలు 15 నుండి 20 శాతం ఎక్కువగా ఉన్నాయి. వేసవి సెలవుల వల్ల ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటమే దీనికి కారణం” అని వివరించారు.
యూఏఈ నుండి ఇండియాకు లేదా ఇండియా నుండి యూఏఈకి ప్రయాణించే వారు ముందస్తుగా ప్లాన్ చేసుకోవాలని, విమాన టికెట్ ధరలను ఎప్పటికప్పుడు గమనిస్తూ తక్కువ ధరలో ఉన్నప్పుడే బుక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
