లండన్‌లోని ఒక కేఎఫ్‌సీ (KFC) అవుట్‌లెట్‌లో పనిచేస్తున్న భారతీయ వ్యక్తిపై జాతి వివక్ష చూపి, అక్రమంగా ఉద్యోగం నుండి తొలగించినందుకు గాను కోర్టు అతనికి దాదాపు 67,000 పౌండ్ల (సుమారు ₹74 లక్షలు) పరిహారం మంజూరు చేసింది. ఈ కేసును విచారించిన ట్రిబ్యునల్ బాధితుడికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
తమిళనాడుకు చెందిన మధేష్ రవిచంద్రన్ అనే వ్యక్తి జనవరి 2023లో లండన్‌లోని వెస్ట్ విక్హామ్ బ్రాంచ్‌లో పనిలో చేరారు. అక్కడ మేనేజర్ తనను ‘బానిస’ అని పిలిచేవారని, అదనపు గంటలు పనిచేయాలని ఒత్తిడి చేసేవారని రవిచంద్రన్ కోర్టుకు తెలిపారు.
రవిచంద్రన్ పనిలో చేరిన రెండు నెలలకే అతనికి వార్షిక సెలవులను నిరాకరించారు. మేనేజర్ కజన్ థైవేంతిరం మరొక ఉద్యోగికి సెలవులు ఇస్తూ, రవిచంద్రన్‌ను ఉద్దేశించి “ఈ బానిస” అని అనడం తాను విన్నట్లు బాధితుడు పేర్కొన్నాడు. ఈ అవమానం భరించలేక రవిచంద్రన్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. దీనిపై ఫిర్యాదు చేసినప్పటికీ కంపెనీ సరైన విచారణ చేపట్టలేదని ఆయన ఆరోపించారు.
ఈ కేసును విచారించిన జడ్జి పాల్ అబాట్.. రవిచంద్రన్ సెలవు నిరాకరణ వెనుక జాతి వివక్ష ఉందని, అతను తీవ్ర అవమానానికి గురయ్యాడని నిర్ధారించారు. జాతి వివక్ష మరియు వేధింపుల కారణంగానే అతను ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చిందని కోర్టు తేల్చింది. రవిచంద్రన్ వాదనను అంగీకరించిన కోర్టు, అతనికి £66,800 పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది.
పరిహారంతో పాటు, సదరు కేఎఫ్‌సీ అవుట్‌లెట్‌ను నడుపుతున్న ‘నెక్సస్ ఫుడ్స్ లిమిటెడ్’ (Nexus Foods Limited) తన ఉద్యోగులందరికీ పని ప్రదేశంలో వివక్షపై అవగాహన కల్పించేలా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని జడ్జి సూచించారు.
